ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు.. చిరాగ్ శెట్టితో కలిసి డబుల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి తమ కెరీర్లో అత్యుత్తమ విజయాన్ని అందుకున్నారు. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్లుగా నిలిచిందీ జోడి. సాత్విక్-చిరాగ్ జోడీ ఆదివారం మలేసియాకు చెందిన ఆంగ్ యెవ్ సిన్-టియో యీలతో పోటీ పడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ 16-21, 21-17, 21-19తో ఆంగ్ యెవ్ సిన్-టియో యీ (మలేసియా)పై విజయం సాధించారు.
అయితే తొలి సెట్లో ఓడినప్పటికీ నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు. ఈ జోడీ ఎక్కడా డీలా పడకుండా గొప్పగా పోరాడి టైటిల్ సాధించిన తీరు అద్భుతం. ఆరంభంలో స్కోర్లు 4-4, 7-7, 13-13 ఇలా సమమవుతూ.. మ్యాచ్ ఆసక్తిగా మారింది. చివర్లో ధాటిగా ఆడిన మలేసియన్ జోడీ స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ జోడీ.. సాత్విక్-చిరాగ్ రెండో గేమ్‌లో చాలా వరకు వెనుకబడే ఉన్నారు. ఇక అందరూ ఈ సారీ టైటిల్ చేజారేట్లేనా అంటూ ఆందోళన చెందారు. ఒక దశలో భారత జోడీ 7-13తో వెనుకబడింది.