తెలంగాణ

telangana

ETV Bharat / sports

Fifa world cup : అర్జెంటీనా గెలిచినా.. ఆ కప్పు దక్కదు..! ఎందుకంటే..? - అర్జెంటీనాకు కప్పు దక్కదు

ఫుట్​బాల్​ ప్రపంచకప్​ ముగిసింది. ఉత్కంఠభరింతంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా విజయం సాధించింది. కానీ అసలైన కప్పును మాత్రం ఆ జట్టు స్వదేశం తీసుకెళ్లలేదు. కారణం ఏంటంటే..?

Fifa world cup
అర్జెంటీనా

By

Published : Dec 20, 2022, 10:39 AM IST

ప్రపంచకప్‌ను ముద్దాడాలనే మెస్సి కల తీరింది. అర్జెంటీనా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కానీ అసలైన కప్పును మాత్రం ఆ జట్టు స్వదేశం తీసుకెళ్లలేదు. బదులుగా బంగారు పూత పూసిన కాంస్య నమూనా కప్పు ఆ జట్టు సొంతమైంది. దీని వెనుక పెద్ద కథే ఉంది. ప్రపంచకప్‌ విజేతలకు ఇచ్చే కప్పును మొదట జూల్స్‌ రిమెట్‌ ట్రోఫీగా పిలిచేవాళ్లు. ప్రపంచకప్‌కు పునాది వేసిన మాజీ ఫిఫా అధ్యక్షుడైన రిమెట్‌ గుర్తుగా ఆ పేరు పెట్టారు. 1930 నుంచి 1970 వరకు 3.8 కిలోల బరువుతో, బంగారు పూతతో ఉండే ఆ ట్రోఫీని విజేతలకు ఇచ్చేవాళ్లు. అప్పటి నిబంధనల ప్రకారం మూడు సార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్లే ఈ అసలైన ట్రోఫీని తమతో ఉంచుకునే అవకాశం ఉండేది.

అలా 1970లో మూడో సారి విజేతగా నిలిచిన బ్రెజిల్‌ దీన్ని దక్కించుకుంది. కానీ 1983లో రియో డి జెనీరోలోని బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి దీన్ని దొంగిలించారు. ఇప్పటివరకూ దీన్ని గుర్తించలేకపోయారు. ఆ దుండగులు ట్రోఫీని కరిగించి, బంగారాన్ని అమ్మేసుకున్నారని అంతా నమ్ముతున్నారు. దాని కింది భాగం మాత్రమే దొరికింది. ఇప్పుడది జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రపంచకప్‌ మ్యూజియంలో ఉంది. అంతకంటే ముందే 1966లోనూ ఆ కప్పు దొంగతానానికి గురైనా, వారం రోజుల్లో తిరిగి గుర్తించారు.

1974 నుంచి రిమెట్‌ ట్రోఫీ స్థానంలో ఫిఫా ప్రపంచకప్‌ను విజేతలకు అందిస్తున్నారు. సిల్వియో గజానిగా తీర్చిదిద్దిన ఈ కప్పు బరువు 6.175 కిలోలు. దీన్ని 4,927 గ్రాములు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా విజేతలు ఈ ట్రోఫీని స్వదేశం తీసుకెళ్లడానికి వీల్లేదు. దీన్ని ఫిఫా ప్రపంచకప్‌ మ్యూజియంలోనే ఉంచుతున్నారు. దీని కింది భాగాన విజేత పేరును జతచేస్తారు. దీనికి బదులుగా బంగారు పూతతో కూడిన కాంస్య ప్రతిరూపాన్ని విజేతలకు అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details