Leo Messi World Cup : లియొనెల్ మెస్సీ.. ఈ సాకర్ మాంత్రికుడి ఉజ్వల కెరీర్‌కు అద్భుతమైన ముగింపునిస్తూ.. ప్రపంచకప్ వచ్చి అతడి ఒళ్లో వాలింది. తన అత్యుత్తమ ఆటనంతా ఈ కప్పు కోసమే దాచుకున్నాడా అన్నట్లు.. అతను చూపించిన వేగం, సహచరులతో అతడి సమన్వయం, ప్రత్యర్థి డిఫెన్స్ గోడల్ని అతను బద్దలు కొట్టిన వైనం ఒక చరిత్ర! ఒక మేటి ఫుట్‌బాలర్ తన అత్యుత్తమ ఆటను బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఈ నెల రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచమంతా చూసి ఫిదా అయిపోయింది. మంత్రముగ్ధమైన అతడి ఆటకు.. ప్రపంచకప్ దిగి వచ్చి సలాం కొట్టక తప్పలేదు!
ఆట ఏదైనా సరే, అందులో అత్యుత్తమ స్థాయిని అందుకున్న ఆటగాడు.. ఆ ఆటలో అత్యున్నత ఘనతను సొంతం చేసుకోవాలని కోరుకుంటాం! వన్డే ప్రపంచకప్ కోసం సచిన్ సుదీర్ఘ నిరీక్షణ కొనసాగుతున్న వేళ.. 2011లో అతను దాన్ని అందుకుని నిష్క్రమించాలని మెజారిటీ క్రికెట్ ప్రపంచం కోరుకుంది! ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన వేళ.. ఒక్క ఫ్రాన్స్ అభిమానులు తప్ప అందరూ మెస్సీ జట్టుకే కప్పు సొంతం కావాలని కోరుకున్నారు! మెస్సిపై అభిమానం అలాంటిది మరి! ఫుట్‌బాల్ అందాన్ని, సొగసును ద్విగుణీకృతం చేసేలా ఆడే అరుదైన ఆటగాళ్లలో మెస్సి ఒకడు. అతడి పాద కదలికలు, డ్రిబ్లింగ్ నైపుణ్యం, గోల్స్ కొట్టడంలో నేర్పరితనం చూసి.. ముందు తరం దిగ్గజాలు సైతం అబ్బురపడ్డారు.
ఫుట్‌బాల్‌తో పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా కాసేపు తన ఆట చూస్తే ఈ ఆటలో మజా ఏంటో అర్థమై ఆస్వాదించేలా చేయగల ఆకర్షణ మెస్సి సొంతం. రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో, క్లబ్ ఫుట్‌బాల్‌లో తన మంత్రముగ్ధమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు లియొనెల్ అందించిన వినోదం అపరిమితం! అందుకే అతడి ఘనతల సరసన ప్రపంచకప్ విజయం కూడా చేరాలని ఎప్పట్నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. 2014లో ఆ కలకు అత్యంత చేరువగా వచ్చి త్రుటిలో కప్పును కోల్పోయాడు. కానీ 2022 నాటికి వయసు పెరిగినా ఉత్సాహం, చురుకుదనం తగ్గని మెస్సి.. తన పతాక స్థాయి ఆటతో జట్టును గెలిపించాడు.