Martinez Argentina: ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో ఉత్తమ ప్రదర్శనతో అర్జెంటీనా హీరోగా మారిన ఎమిలియానో మార్టినెజ్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయ యాత్రలో భాగంగా తలకు ఎంబాపె ముఖం ఫొటో తగిలించిన చిన్న పిల్లాడి బొమ్మను అతను పట్టుకుని బస్సుపై కనిపించడమే అందుకు కారణం. పక్కన మెస్సి కూడా ఉన్నాడు. ఎంబాపె లాంటి అగ్రశ్రేణి ఆటగాణ్ని ఇలా ఎగతాళి చేయడం సరికాదంటూ మార్టినెజ్‌పై విమర్శలు వస్తున్నాయి.
ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌తో సహా ఎంబాపె మొత్తం 4 గోల్స్ చేశాడు. "ఇదో పేలవ చర్య. మీరు ప్రపంచ ఛాంపియన్ లాగా ప్రవర్తించాలి. ఇలా ఎంబాపెను అవహేళన చేయడం అనవసరం. అతను ఫైనల్లో 4 గోల్స్ చేశాడు. కాబట్టి మీకు బడాయి కొట్టుకోవడానికి హక్కు లేదు" అని ఒకరు పోస్టు చేశారు. మార్టినెజ్‌కు సిగ్గులేదని, అతనెప్పుడూ వార్తల్లో నిలవాలని చూస్తాడని మరొకరు మండిపడ్డారు.
మెస్సి.. ఆరోసారి!:ఇప్పటికే మెస్సి అయిదు ప్రపంచకప్‌లు ఆడాడు. మరోసారి మెగా టోర్నీలో ఆడితే ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ అర్జెంటీనా కెప్టెన్ అదే ప్రణాళికతో ఉన్నాడని 1986 ప్రపంచకప్ విజేత జార్జ్ వాల్దానో అభిప్రాయపడ్డాడు. "ప్రపంచకప్‌కు ముందు మెస్సిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కెమెరా ముందు కాకుండా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాడు. అయిదో ప్రపంచకప్ ఆడుతున్నానని అన్నాడు. ఆరు ప్రపంచకప్‌లు ఆడడం అసాధ్యమని చెప్పాడు.
"ఒకవేళ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తే వచ్చే ప్రపంచకప్ వరకూ అర్జెంటీనా జెర్సీ వేసుకుని ఆడతా’ అని అన్నాడు. మెస్సికి ఆ సామర్థ్యం ఉందేమో చూడాలి. ఒకే ఆటగాడు ఆరు ప్రపంచకప్‌లు ఆడడం ఆచరణాత్మకంగా అసాధ్యమని ఫుట్‌బాల్ చాటింది" అని ఈ అర్జెంటీనా మాజీ ఆటగాడు జార్జ్ తెలిపాడు. ఈ ఫైనల్‌తో ప్రపంచకప్ ప్రయాణం ముగిస్తానని ఫ్రాన్స్‌తో పోరుకు ముందు చెప్పిన మెస్సి.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్‌గా ఆడాలని ఉందని తెలిపాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి మెస్సికి 39 ఏళ్లు వస్తాయి. మరి అప్పటికీ అతను ఇదే జోరు కొనసాగించగలడా? అన్నది చూడాలి. మెస్సి ఆడాలి అనుకుంటే అతనికి 2026 ప్రపంచకప్ జట్టులో చోటు ఉంటుందని కోచ్ స్కాలోని కూడా చెప్పాడు.