అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్ ఫండ్ పేరిట చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్ పోటీల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్ కామత్ కూడా పోటీపడి ఆనంద్‌ను ఓడించారు. అయితే, అతడు మోసం చేసి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) కార్యదర్శి భరత్ చౌహన్ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని వాపోయారు.
ఈ క్రమంలోనే నిఖిల్ కామత్ కూడా ట్విట్టర్లో ఓ పోస్టు చేసి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. "నేను చిన్నప్పుడు చెస్ నేర్చుకునే రోజుల్లో విశ్వనాథ్ ఆనంద్‌తో ఆడాలనుకున్నా. అది నిన్నటితో నిజమైంది. అక్షయపాత్ర సంస్థ వారు ఆనంద్‌తో కలిసి ఛారిటీ కోసం చెస్ పోటీలు నిర్వహించడం వల్ల నాకు ఆ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే, నేను నిజంగానే విశ్వనాథ్ ఆనంద్‌ను చెస్‌లో ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు. అదెలా ఉందంటే నేను నిద్రలేచిన వెంటనే ఉసేన్ బోల్ట్‌తో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీపడి గెలిచినట్లుగా ఉంది" అని నిఖిల్ పోస్టు చేశారు.