తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్​ రికార్డు

రెజ్లర్ అన్షు మలిక్(Anshu Malik wrestler) చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్(wrestling world championship 2021) సెమీస్​లో సొలోమియా వినిక్(ఉక్రెయిన్)పై విజయం సాధించి ఫైనల్​కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్​గా నిలిచింది.

anshu malik
అన్షు మలిక్

By

Published : Oct 7, 2021, 6:58 AM IST

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో(wrestling world championship 2021) ఫైనల్‌ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా అన్షు మలిక్‌(Anshu Malik Wrestler) చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల అన్షు 57 కిలోల సెమీఫైనల్లో టెక్నికల్‌ సుపీరియారిటీతో సొలోమియా వినిక్‌ (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. అన్షు(anshu malik news) 11-0తో పైచేయి సాధించి ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఇంతకుముందు నలుగురు భారత మహిళలు గీత ఫొగాట్‌ (2012), బబిత ఫొగాట్‌ (2012), పూజ దండా (2018), వినేష్‌ ఫొగాట్‌ (2019) మాత్రమే ప్రపంచ రెజ్లింగ్‌లో పతకాలు గెలుచుకున్నారు. వీళ్లంతా కాంస్యాలే సాధించారు. ఫైనల్‌ చేరలేదు.

ఇక అన్షు.. బిశంబర్‌ సింగ్‌ (1967), సుశీల్‌ కుమార్‌ (2010), అమిత్‌ దహియా (2013), బజ్‌రంగ్‌ పునియా (2018), దీపక్‌ పునియా (2019) తర్వాత ప్రపంచ పోటీల్లో ఫైనల్లో ప్రవేశించిన భారత ఆరో రెజ్లర్‌గా ఘనత సాధించింది. ఇప్పటివరకు భారత్‌ నుంచి ఒక్క సుశీల్‌ మాత్రమే ప్రపంచ ఛాంపియన్‌గా(wrestling world championship) నిలిచాడు. అన్షు గురువారం పసిడి కోసం పోటీపడనుంది.

సెమీఫైనల్లో వినిక్‌పై అన్షు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చురుకైన కదలికలతో ప్రత్యర్థిని పడేసింది. గత ఏడాది సీనియర్‌ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన అన్షు అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన ఈ అమ్మాయి.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అక్కడ ఆరంభ రౌండ్లోనే విఫలమైన ఆమె.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి వేటకు సిద్ధమైంది. అన్షు క్వార్టర్‌ఫైనల్లో 5-1తో ఎర్కెంబయార్‌ (మంగోలియా)పై విజయం సాధించింది.

మరో భారత బాక్సర్‌ సరిత (59 కేజీ)కు మాత్రం నిరాశ తప్పలేదు. మొదటి రౌండ్లో 8-2తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లిండా మొరైస్‌ (కెనడా)కు షాకిచ్చిన ఆమె.. ఆ తర్వాత క్వార్టర్స్‌లో 3-1తో జర్మనీకి చెందిన సాండ్రాపై విజయం సాధించింది. కానీ సెమీఫైనల్లో 0-3తో బిల్యానా జివ్‌కోవా దుదోవా (బల్గేరియా) చేతిలో పరాజయంపాలైంది. సరిత ఇక కాంస్యం కోసం పోటీపడుతుంది. 72కేజీ క్వార్టర్‌ఫైనల్లో దివ్య కుమార్‌ 0-10తో మసాకో ఫురిచ్‌ (జపాన్‌)పై చేతిలో ఓడిపోయింది. బౌట్లో ఏ దశలోనైనా రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల అంతరం ఏర్పడితే ఆ బౌట్‌ ముగిసినట్లే. ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను టెక్నికల్‌ సుపీరియారిటీ ఆధారంగా విజేతగా నిలిచినట్లు ప్రకటిస్తారు.

ఇదీ చదవండి:

RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్​రైజర్స్​దే విజయం

ABOUT THE AUTHOR

...view details