తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంజూ.. పతకంతో పాటు మనసుల్ని గెలిచింది అలా! - anju bobby george news

ప్రపంచ అథ్లెటిక్స్​లో పతాకం గెల్చుకున్న ఏకైక అథ్లెట్ అంజూ బాబీ జార్జ్. అయితే దేశ చరిత్రలో గుర్తుండిపోయే విజయాల్ని తాను ఒక్క కిడ్నీతోనే సాధించినట్లు ఆశ్చర్యకర నిజాన్ని చెప్పింది. తన క్రీడా ప్రయాణంలోని ఆసక్తికర విషయాల్ని ఈ సందర్భంగా వెల్లడించింది.

anju bobby george special story about her single kidney
అంజూ.. పతకంతో పాటు మనసుల్ని గెలిచింది అలా!

By

Published : Dec 9, 2020, 4:25 PM IST

నీకు ఆట ముఖ్యమా... ప్రాణం ముఖ్యమా? అంటే ఆటే... అన్నది ఆమె సమాధానం.

'వరల్డ్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌' పోటీలకు సరిగ్గా 20 రోజుల ముందు..

'నీకో కిడ్నీ లేదు... ఇక లాంగ్‌జంప్‌ గురించి మర్చిపోవచ్చు...'

అని డాక్టర్లు చెప్పిన రోజున అంజూ కూడా అందరిలాగానే కుంగిపోయింది.

కుమిలిపోయింది. 'దేవుడా! ఎందుకింత శిక్ష వేశావ్‌' అని బాధపడింది.

కానీ తేరుకుంది... శరవేగంగా కోలుకుంది. తన భర్త నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

ప్రపంచ అథ్లెటిక్‌ పోటీల్లో మొదటిసారి మన దేశ జెండాను రెపరెపలాడించింది. జాతి మెచ్చిన లాంగ్‌ జంప్‌ క్రీడాకారిణి అంజూ బాబీజార్జి పంటి బిగువున భరించిన ఆ కష్టాన్ని 'ఈనాడు వసుంధర'తో పంచుకున్నారిలా...

2003... మరికొద్ది రోజుల్లో ప్రపంచ, అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌..

జర్మనీలో జరుగుతున్న పోటీల్లో క్షణం తీరిక లేకుండా ఉంది అంజూ.

ఏదో తెలియని నీరసం ఆమెను ఆవహిస్తోంది.

'ముందున్నది వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ కదా బహుశా ఆ ఒత్తిడే వల్లేమో' అని సర్దిచెప్పుకొంది.

డాక్టర్లయినా అదే చెబుతారులే అనుకుని వైద్యుల్ని కలిసింది.

'ఒత్తిడి తెచ్చుకోవద్దు. మంచి ఆహారం తిను'లాంటి మాటలే వింటాను అనుకున్న అంజూకు.. ఎప్పుడూ వినకూడదు అనుకున్న మాటలు వాళ్ల నోటి నుంచి వినిపించాయి.

'అంజూ నువ్వు ఇక ఆటల గురించి మర్చిపోతే మంచిది. ఆరునెలలపాటు కల్లో కూడా వాటి గురించి ఆలోచించొద్దు' అన్నారు డాక్టర్లు.

'ఆ మాటలు విని షాక్‌ అయ్యా. నిలువెల్లా భయం ఆవహించింది. నాకు తెలుసు క్రీడాకారుల విషయంలో చిన్న అనారోగ్యం కూడా వాళ్ల కెరీర్‌ను చావు దెబ్బ కొడుతుందని. నాకున్న సమస్య చిన్నదేం కాదు. బాడీచెకప్‌ చేయించుకున్నప్పుడు నాకు ఒకే కిడ్నీ ఉందని తెలిసింది. అదొక్కటే నా సమస్య కాదు. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు త్వరగా అలసిపోవడం, శరీరంలో వాపులు, జాయింట్‌ పెయిన్స్‌, ముఖ్యంగా మెడికల్‌ అలెర్జీ ఉంది. ఒంటి నొప్పులతో సతమతవుతున్నా వాటిని తగ్గించుకోవడానికి మాత్రలు కూడా వేసుకోలేని పరిస్థితి. మరోవైపు డాక్టర్లయితే నేను ప్రాణంగా ప్రేమించిన ఆటనే వదిలేయమన్నారు.

పూర్తిగా నిరాశలో ఉన్న నాకు నా భర్త, కోచ్‌ అయిన బాబీ అండగా నిలబడ్డారు.నన్నో అంతర్జాతీయ క్రీడాకారిణిగా చూడాలనేది అతని ఆశ. నా అనారోగ్యం విషయాన్ని బయటకు చెబితే నేను పతకం అందుకున్న ప్రతిసారీ నా విజయం కన్నా... నా అనారోగ్యమే చర్చ కావొచ్చు. అందుకే ఈ విషయాన్ని బయటకు చెప్పాలని అనుకోలేదు.

అథ్లెట్ అంజూ బాబీ జార్జ్

'నన్ను నమ్ము. అవసరమైతే నా కిడ్నీ నీకిస్తా' అని భరోసా ఇచ్చారు నా భర్త. క్రీడాకారిణిగానే కాదు.. భార్యగా కూడా ఆ భరోసా నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. 'అన్నీ మర్చిపోయి శిక్షణలో అడుగుపెట్టమ'ని మావారు కోచ్‌గా ఆదేశించారు' అంటూ ఆనాటి విషయాలని గుర్తుచేసుకున్నారామె.

మరొకరైతే ఆ కష్టం నుంచి తేరుకోలేరు. కానీ అంజూ దాని గురించి పూర్తిగా మర్చిపోయింది. భర్త చెప్పినట్టుగా... 100 శాతం శిక్షణ మీదే దృష్టి పెట్టింది.

'ట్రైనింగ్‌లో ఎక్కువ సమయం ఉన్నప్పుడు నాలో ఒత్తిడి పెరిగేది. అలసట ఆవరించేది. అందుకే శిక్షణా రీతిని నా శరీర పరిస్థితికి అనుగుణంగా మార్చారు.

నేను మందులు వాడటానికి వీలుకాదు... వాడితే అలర్జీ వస్తుంది. అందుకే పరిస్థితిని నా కంట్రోల్‌కి తెచ్చుకుని.. చిన్నచిన్న పాటి విరామాలు ఇస్తూ ఎక్కువ అలసిపోకుండా శిక్షణ పూర్తిచేసుకునేదాన్ని. అయినా ఒక్కోసారి పరిస్థితి నా అదుపులో ఉండేది కాదు. అలాంటప్పుడు కోచ్‌ ఇచ్చిన ధైర్యం నన్ను ముందుకు నడిపించింది.

2003 ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్‌ పోటీల్లో కాంస్య పతకం గెల్చుకున్నా. దేశం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. ప్రపంచ అథ్లెటిక్స్‌లో దేశానికి అందిన మొదటి పతకం అది.

కేరళలోని కొట్టాయం మాది. స్నేహితులంతా పొలాల్లో స్వేచ్ఛగా నచ్చినట్టుగా మట్టిలో ఆడుకుంటుంటే నాన్న మాత్రం... 'ఆడుకో కానీ ట్రాక్‌లో మాత్రమే' అన్నప్పుడు ఎందుకోసం ఈ త్యాగం అనుకునేదాన్ని. స్పోర్ట్స్‌ హాస్టల్‌లో అందరికీ దూరంగా ఉన్నప్పుడూ ఇదే అభిప్రాయం నాది. మొదటి అంతర్జాతీయ మెడల్‌ సాధించి దేశప్రజల నమ్మకాన్ని అందుకున్నప్పుడు 'నీ త్యాగాలకు ఓ రోజు వచ్చింది అంజూ' అనుకున్నా. ఆ స్ఫూర్తితోనే ముందడుగు వేశాను. ఒక లోపంతో కూడా నేనీ విజయం సాధించానని చెప్పడానికి కారణం... కొవిడ్‌ కారణంగా చాలా మంది క్రీడాకారిణుల్లో ఉన్న నైరాశ్యాన్ని దూరం చేయడానికే అంటూ' చెప్పుకొచ్చారు అంజూ.

అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details