యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్, ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఓ చెస్ అకాడమీ ఏర్పాటు చేయనున్నాడు. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో ఈ అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు.
'వెస్ట్‌బ్రిడ్జ్-ఆనంద్ చెస్ అకాడమీ' పేరుతో దేశంలోని టాప్ 5 యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనున్నాడు విశ్వనాథన్ ఆనంద్. ఈ జాబితాలో.. చెస్ ఫెలోషిప్ అర్హత పొందిన పి ప్రజ్ఞానంద(15), నిహాల్ సరిన్(16), రౌనక్ సాధ్వాని(15), డి గుకేష్(14), ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి(19) ఉన్నారు.
"గత 20 ఏళ్ల నుంచి చెస్ ఆటకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలో మంచి సామర్థ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే ప్రపంచ ఛాంపియన్లుగా, టాప్ 10 ఆటగాళ్లుగా నిలుస్తారు".
-విశ్వనాథన్ ఆనంద్, చెస్ క్రీడాకారుడు.