ఎప్పుడైనా ఊహించామా.. ఆటకు ఇన్ని నెలల విరామం వస్తుందని! ఎన్నడైనా అనుకున్నామా.. క్రీడల ఊసే ఎత్తకుండా ప్రపంచం ఉంటుందని! కానీ.. కరోనా రక్కసి పడగ విప్పి ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించింది. ఎక్కడ చూసినా వైరస్ వార్తలే. మైదానాల్లో ఆటగాళ్లు లేరు.. స్టాండ్స్‌లో అభిమానుల కేరింతలు లేవు.. టీవీల్లో ప్రత్యక్ష మ్యాచ్‌లు లేవు. ఈ సమయంలో వైరస్‌తో విసుగెత్తి, డీలాపడ్డ ప్రజలకు కాస్తంత ఉపశమనాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఆటగాళ్లు, క్రీడాపాలకులు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ లీగ్‌లు.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌తో క్రికెట్ మ్యాచ్‌లు.. ఇలా ఆటల సందడి మళ్లీ మొదలైంది. కానీ ఇంతకు ముందులా కాదు. ఆటగాళ్ల ఆరోగ్యం, క్షేమానికి పెద్ద పీట వేస్తూ అంతా కొత్తగా!
ఉన్న చోటే ఉంటూ..
ఓ పక్క టీవీ.. మరో వైపు సోఫా సెట్లు.. మధ్యలో సైకిల్ తొక్కుతున్న టామ్ డుమోలిన్ (నెదర్లాండ్స్). అతడేదో సరదాగానో కసరత్తుల్లో భాగంగానో అలా చేయట్లేదు. ఇంట్లోనే ఉంటూ ఓ టోర్నీలో పాల్గొన్నాడు. కరోనా కారణంగా తొలిసారిగా వర్చువల్‌గా నిర్వహించిన 26 కిలోమీటర్ల ఆమ్‌స్టెల్ గోల్డ్ రేసులో అతడు ఇలా పోటీపడ్డాడు.
ఇంట్లోనే ఉండి పోటీలో పాల్గొన్న సైక్లిస్ట్ లాక్‌డౌన్ వల్ల ఆటలో వచ్చిన పెను మార్పు ఏదైనా ఉందా అంటే... అది వర్చువల్ టోర్నీలే. వేర్వేరు రంగాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆ సాంకేతికత వైరస్ దెబ్బకు ఆటలో అడుగుపెట్టింది. టోర్నీల నిర్వహణలో కీలకంగా మారింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కలిగించింది.
ఎక్కడి నుంచైనా..
డైమండ్ లీగ్ పోటీల నిర్వాహకులు సైతం వర్చువల్ సాంకేతికతను అందిపుచ్చుకుని వివిధ దేశాల్లో క్రీడలను నిర్వహిస్తుండడం విశేషం. వివిధ అంచెలుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అథ్లెట్లు తమ నివాసాలకు దగ్గర్లో ఉన్న స్టేడియాల నుంచే ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆయా స్టేడియాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా వాళ్ల పరుగును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అందరినీ ఒక్క దగ్గరకు చేర్చి.. వాళ్ల టైమింగ్‌ను నమోదుచేస్తున్నారు. ఇదే విధానంలో సాగిన అంతర్జాతీయ షూటింగ్ పోటీల్లో భారత షూటర్లు రాణించారు. ఎప్పటి నుంచో అంతర్జాల వేదికగా సాగుతోన్న చెస్ పోటీలకు ఈ లాక్‌డౌన్‌తో మరింత ఆదరణ పెరిగింది. ఇటీవల ముగిసిన ఫిడే మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు హంపి, హారిక మెరిశారు. ప్రస్తుతం లెజెండ్స్ ఆఫ్ చెస్ టోర్నీలో ఆనంద్ తలపడుతున్నాడు. వర్చువల్ సైక్లింగ్ రేసులూ జరుగుతున్నాయి.
స్టేడియంలో పరుగెడుతున్న అథ్లెట్ బుడగ ప్రపంచం..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ టోర్నీ నిర్వహించాలన్నా ముందుగా వినిపిస్తున్న పేరు.. 'బయో సెక్యూర్ బబుల్ (బుడగ)'. రెండు జట్ల ఆటగాళ్లను, సిబ్బందిని, మ్యాచ్ ప్రతినిధులను, స్టేడియం, హోటళ్ల సిబ్బందిని ఓ నిర్ణీత ప్రదేశం దాటి వెళ్లనివ్వకుండా ఉంచడమే ఈ విధానం. ఇంగ్లాండ్‌లో వెస్టిండీస్ సిరీస్ దానికి ఓ మంచి ఉదాహరణ. రెండు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, మ్యాచ్‌ల నిర్వహణతో సంబంధమున్న వారందరికీ మొదట కరోనా నిర్ధరణ పరీక్షలు చేసి కొన్ని వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాత మరోసారి వైరస్ పరీక్షలు నిర్వహించి మైదానంలో సాధన చేసేందుకు అనుమతిచ్చారు. మ్యాచ్‌కు ముందు మరోసారి పరీక్షించారు. సిరీస్ ముగిసేంతవరకూ ఆ బబుల్ నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి, లోపలికి రావడానికి వీల్లేదు. ఫార్ములావన్ గ్రాండ్ ప్రి రేసులూ అదే ట్రాక్‌లో పరుగెడుతున్నాయి. మరోవైపు ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ బాస్కెట్‌బాల్ (ఎన్‌బీఏ) లీగ్‌నూ ఇదే విధానంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఫుట్‌బాల్ లీగ్‌లు సైతం ఇదే పంథాలో సాగుతున్నాయి. ఈ బబుల్ ఇచ్చిన నమ్మకంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైపోయింది.
బయో బబూల్ విధానంలోని క్రికెట్ స్టేడియం ఆర్థికంగా గట్టి దెబ్బ..
దేశ ఆర్థిక వ్యవస్థకు క్రీడా రంగం కూడా దన్నుగా ఉంటుంది. టోర్నీల నిర్వహణతో పర్యాటకం, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. మన దేశంలో క్రీడల నుంచి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో 85 శాతం క్రికెట్‌దే. కానీ వైరస్‌తో దానికి గండి పడింది. దాదాపు రూ.9 వేల కోట్ల విలువ గల క్రీడా స్పాన్సర్‌షిప్ రంగం దెబ్బతిననుందని సమాచారం. టీమ్‌ఇండియా దుస్తుల స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కొనసాగించరాదని నైకి నిర్ణయించింది. నిరుడు రూ.47,500 కోట్లుగా ఉన్న ఐపీఎల్ విలువ ఈ ఏడాది తగ్గే అవకాశముందని డఫ్ అండ్ ఫెల్ఫ్స్ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించినప్పటికీ ఆ మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. టికెట్ల విక్రయం ద్వారా ఓ ఐపీఎల్ సీజన్‌లో రూ.300 కోట్లు ఆదాయం వస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అభిమానులు స్టేడియాలకు రాకపోతే.. వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ధర తగ్గించమని కోరే అవకాశముంది. ఆటలు లేకపోవడంతో దేశంలో క్రీడా పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన జలంధర్‌లో రూ.2000 కోట్ల వ్యాపారం సందిగ్ధంలో పడింది.
లేకున్నా.. ఉన్నట్లుగా..
స్టేడియంలో మనుషులకు బదులుగా వారి బొమ్మలు ఆటలైతే మొదలయ్యాయి కానీ స్టేడియంలో అభిమానుల సందడి లేదు. ఆ అనుభూతిని తిరిగి తెచ్చేందుకు కొన్ని టోర్నీల్లో స్టేడియంలోని స్టాండ్స్‌లో అభిమానుల ఫోటోలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు. తాజాగా అమెరికాలోని మేజర్ లీగ్ బేస్‌బాల్ ప్రసారదారు ఫాక్స్‌స్పోర్ట్స్ మరో అడుగు ముందుకేసి తమ టీవీ ప్రేక్షకుల కోసం లేని అభిమానులను సృష్టించే ప్రయత్నం చేస్తోంది. టీవీల్లో మ్యాచ్‌లు చూసే ప్రేక్షకులకు మైదానంలోని స్టాండ్స్‌లో అభిమానులు కనబడనున్నారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వారి హావభావాలు ఉంటాయి. మరోవైపు మైదానంలో జరిగే మ్యాచ్‌లకు ఇంటి నుంచే వ్యాఖ్యానం అందించనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన 3టీసీ సాలిడారిటీ కప్ మ్యాచ్ కోసం భారత మాజీ ఆటగాళ్లు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ ఇంటి నుంచే "వర్చువల్ కామెంట్రీ" చేశారు. ఐపీఎల్‌లోనూ ఇదే తరహా వ్యాఖ్యానాన్ని చూసే అవకాశముంది.