కరోనా పరిస్థితుల కారణంగా ఇంటి నుంచి ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా తమ పరిసరాల్లోనే ప్రాక్టీసు చేసుకునే అవకాశాన్ని దేశంలోని షూటర్లకు కల్పిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. ప్రాక్టీసుకు అవసరమైన పరికరాలు, ఇతర సామగ్రిని వాళ్లకు అందిస్తామని చెప్పారు. ఒలింపిక్ కోర్ షూటర్ల బృందం కోసం దిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌ను శాట్స్ ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న షూటర్లు ఇక్కడికి రావడం సురక్షితం కాదని భావించి, వాళ్లకు అందుబాటులో ఉన్న విధంగా ప్రాక్టీసు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దేశంలోని ఎలైట్, అభివృద్ధి చెందుతున్న, ఖేలో ఇండియా షూటర్లు తమ ప్రాక్టీసుకు అవసరమైన సామగ్రిని కేఎస్ఎస్ఆర్, అన్ని గుర్తింపు పొందిన అకాడమీల నుంచి అందిస్తామని కేఎస్ఎస్ఆర్ సందర్శించిన మంత్రి పేర్కొన్నారు.
షూటర్ల కోసం ఇంటి వద్దకే సామగ్రి: కిరణ్ రిజిజు - కిరెన్ రిజిజు వార్తలు
వివిధ ప్రాంతాల్లో ఉన్న షూటర్లు, దిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌కు రావడం కష్టమవుతుందని అన్నారు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు. అందుకే వారి ఇంటివద్దకే అవసరమైన సామగ్రి పంపిస్తామని హామీ ఇచ్చారు.
"దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అథ్లెట్లు.. ముఖ్యంగా 2024, 2028 ఒలింపిక్స్ ప్రాబబుల్స్ తాము ఉన్న చోటే ప్రాక్టీసు చేసుకునే అవకాశం కల్పించడం ప్రధానమైంది. కరోనా పరిస్థితుల కారణంగా కేఎస్ఎస్ఆర్ లేదా ఇతర అకాడమీలకు వాళ్లు వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. కొందరు ఇప్పటికే ఇంట్లో, పరిసరాల్లో సాధన కొనసాగిస్తున్నారు. సరైన వసతులు, సామగ్రి లేని కారణంగా వాళ్ల సాధన ఆగకూడదు. వాళ్లకు అవసరమైన సామగ్రిని కేఎస్ఎస్ఆర్, గుర్తింపు పొందిన అకాడమీల నుంచి తీసుకోవచ్చు" -కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడా మంత్రి
ఈ నిర్ణయంతో దేశంలో 253 మంది షూటర్లు వాళ్లకు అనువైన చోట ప్రాక్టీసు చేయనున్నారు. "మమ్మల్ని కలవడానికి కిరణ్ రావడం ఆనందంగా ఉంది. మాకు ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో లేదా పరిసరాల్లో ప్రాక్టీసు చేసుకునే అవకాశం షూటర్లకు కల్పించడం గొప్ప నిర్ణయం" అని కేఎస్ఎస్ఆర్లో ప్రాక్టీసు చేస్తున్న షూటర్ అనీశ్ భన్వాలా పేర్కొన్నాడు.