ఒలింపిక్స్ మహా సంబరానికి ఇంకో 70 రోజులు మాత్రమే సమయం మిగిలుంది. గత ఏడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కరోనా కారణంగా 2021కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈసారి టోర్నీ మొదలయ్యే సమయానికి పరిస్థితులు సర్దుకుంటాయని, ప్రశాంతంగా పోటీలు నిర్వహించుకోవచ్చని అనుకున్నారంతా. కానీ గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడేమీ పరిస్థితులు మెరుగుపడిపోలేదు.
ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు పోటీలు నిర్వహించాల్సిందే అని జపాన్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కానీ దేశంలో పరిస్థితులు అందుకు సహకరించేలా లేవు. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం, జనాలు వైరస్‌తో అల్లాడుతుండటం, మొత్తంగా దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో.. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిర్వహణ వద్దు!
టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలనే పిటిషన్‌కు మద్దతుగా 3 లక్షల మంది సంతకాలు చేయడం గమనార్హం. జపాన్‌లో 60 శాతం మంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అక్కడ ఇప్పటిదాకా కేవలం ఒక్క శాతం మందికే కొవిడ్ టీకా వేశారు. కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో వరుసగా ఒక్కో నగరంలో అత్యయిక పరిస్థితిని ప్రకటించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాల్సిన టోక్యోతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. మే 31 వరకు ఇది కొనసాగనుంది. ఒలింపిక్స్ ఆరంభానికి రెండు నెలల ముందు ఆతిథ్య నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండగా.. అంత పెద్ద క్రీడా ఈవెంట్ ఎలా సజావుగా జరుగుతుందన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే సురక్షితంగా జరిపి తీరుతామని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా పదే పదే నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ.. జనాల్లో మాత్రం ఆయన మాటలపై విశ్వాసం కనిపించడం లేదు.
తాజాగా తకరజిమషా అనే పబ్లిషర్.. తన పత్రికలో ఇచ్చిన ఒక పూర్తి పేజీ ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. "వ్యాక్సిన్ లేదు. మందుల్లేవు. ఈ స్థితిలో కరోనాపై వెదురు కర్రలతో పోరాడాలా? పరిస్థితులు మారకపోతే మనం ఈ రాజకీయాల వల్ల చావక తప్పదు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అత్యవసర స్థితిలో జపాన్‌లో చిన్నపిల్లలు కర్రలతో సాధన చేసినప్పటి ఒక ఫొటో పెట్టి కరోనాతో వాళ్లిప్పుడు అదే తరహాలో కర్రలతో పోరాడుతున్నట్లు ఈ ప్రకటనను రూపొందించాడు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఒలింపిక్స్ కోసం ఉత్సాహ పడుతున్న ప్రధానిపై నెటిజన్లు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. మామూలుగా ఒలింపిక్స్ ఆరంభం కాబోతుంటే ఆతిథ్య దేశంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తుండటం పట్ల జనాల్లో హర్షాతిరేకాలు కనిపిస్తాయి. కానీ జపాన్‌లో ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి:అది జరిగినా ఐపీఎల్ ఆడలేను: స్టోక్స్