దేశ రాజధాని దిల్లీలో రెజ్లింగ్ క్రీడాకారులు మళ్లీ రోడ్డెక్కారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాల్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు ఆదివారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న క్రీడాకారులు.. సోమవారం ఉదయం కూడా నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు తమ ఆందోళన విరమించబోమని చెబుతున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వినేశ్ ఫొగాట్‌తో పాటు మరో ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అప్పుడు రాజకీయ పార్టీలను వద్దని.. ఇప్పుడేమో..
అయితేేెబ్రిజ్‌భూషణ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పలు రాజకీయ పార్టీలు వీరికి మద్దతు పలుకుతూ దీక్షలో కూర్చోవాలని ప్రయత్నించారు. అందుకు క్రీడాకారులు తిరస్కరించారు. అయితే ఈసారి తాము అలా చేయబోమని బజరంగ్ పునియా తెలిపాడు. తమ ఆందోళన మద్దతిచ్చేవారు ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని చెప్పాడు.