Alize Cornet News: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో ఏ మాత్రం అంచనాలు లేని కనెపి (ఈస్తోనియా), కార్నెట్ (ఫ్రాన్స్) ఏకంగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. సోమవారం నాలుగో రౌండ్లో కనెపి 5-7, 6-2, 7-6 (10-7) తేడాతో రెండో సీడ్ సబలెంక (బెలారస్)పై విజయం సాధించింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 115వ స్థానంలో ఉన్న కనెపి తొలి సెట్లో గొప్పగా ప్రతిఘటించింది. ఏస్‌లు, విన్నర్లతో చెలరేగిన ఇద్దరు క్రీడాకారిణులు ఓ దశలో 5-5తో నిలిచారు. ఆ సమయంలో తన సర్వీస్ నిలబెట్టుకోవడంతో పాటు తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంక తొలి సెట్ దక్కించుకుంది. కానీ అద్భుతంగా పుంజుకున్న కనెపి రెండో సెట్‌ను ఏకపక్షంగా మార్చేసింది. తొలి సర్వీస్‌నే బ్రేక్ చేసిన ఆమె ఏ దశలోనూ ఆగలేదు. ప్రత్యర్థి తప్పిదాలు కూడా ఆమెకు కలిసొచ్చాయి. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ ఓ దశలో కనెపి 4-2తో ఆధిక్యంలో నిలిచింది. కానీ వరుసగా రెండు గేమ్‌లు గెలిచిన సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్న కనెపి పోరును టైబ్రేకర్‌కు మళ్లించింది. అందులోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డారు. కీలక సమయంలో పైచేయి సాధించిన కనెపి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమె 5 ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది.
రెండో రౌండ్లో మూడో సీడ్ ముగురుజాను ఓడించిన కార్నెట్.. ప్రి క్వార్టర్స్‌లో 6-4, 3-6, 6-4తో మాజీ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా)పై గెలిచింది. తొలి సెట్ నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన కార్నెట్ 3-1తో ఆధిక్యం సాధించింది. మధ్యలో హలెప్ పోరాడినా.. కార్నెట్ ఆ సెట్ దక్కించుకుంది. రెండో సెట్ ఆరంభంలోనూ ఆమెదే దూకుడు. కానీ పుంజుకున్న హలెప్ వరుసగా అయిదు గేమ్‌లు గెలిచి సెట్ సొంతం చేసుకుంది. ఇలాగే సాగిన మూడో సెట్లో కార్నెట్ పైచేయి సాధించింది. ఏడో సీడ్ స్వైటెక్ (పోలెండ్) 5-7, 6-3, 6-3తో సిర్స్‌టీ (రొమేనియా)పై, కొలిన్స్ (అమెరికా) 4-6, 6-4, 6-4తో మెర్టెన్స్ (బెల్జియం)పై నెగ్గారు.