AIFF election results : అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎన్నికల్లో దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భుటియాకు చుక్కెదురైంది. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే విజయం సాధించాడు. 85 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబేకు ముందు రాజకీయ నాయకులు ప్రియరంజన్ దాస్‌మున్షీ, ప్రఫుల్ పటేల్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఎన్నికల్లో 34 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా.. చౌబే 33-1తో భుటియాపై గెలుపొందాడు. రాష్ట్ర సంఘాలకు ఓటు హక్కు కల్పించగా.. భుటియాకు వారి నుంచి మద్దతు లభించలేదు.
ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా చౌబే విజయం, ఒక్క ఓటుకే పరిమితమైన భుటియా - undefined
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భుటియా ఒక్క ఓటు మాత్రమే దక్కించుకున్నారు.
గత ఎన్నికల్లో బంగాల్‌లోని కృష్ణానగర్ పార్లమెంటు స్థానం నుంచి చౌబే బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. భారత్ తరఫున చౌబే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా కొన్నిసార్లు జట్టుకు ఎంపికయ్యాడు. వయో పరిమితి విభాగాల్లో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ఆడాడు. ప్రముఖ క్లబ్‌లు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్‌లకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఓ సమయంలో భుటియా, చౌబేలు ఈస్ట్ బెంగాల్‌కు కలిసి ఆడారు. కర్ణాటక ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.ఎ.హారిస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హారిస్ 29-5తో మానవేంద్ర సింగ్ (రాజస్థాన్ ఎఫ్‌ఏ)పై గెలిచాడు. కిపా అజయ్ (అరుణాచల్‌ప్రదేశ్) 32-1తో కొసరాజు గోపాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గి కోశాధికారిగా ఎన్నికయ్యాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా 14 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఫాల్గుణ ఈసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
TAGGED:
AIFF PRESIDENT