అడ్డంకులను దాటుతూ.. సవాళ్లను అధిగమిస్తూ.. లక్ష్యానికి గురి పెట్టిన బాణంలా.. తిరుగులేని వేగంతో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ దూసుకెళ్తోంది. విలువిద్యలో పతకాలు కొల్లగొడుతోంది. తాజాగా ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో ఈ విజయవాడ ఆర్చర్ అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. అభిషేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ- అభిషేక్ రికార్డుల్లోకెక్కారు. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ప్రపంచకప్ వ్యక్తిగత విభాగంలో ఆమెకు ఇదే తొలి పతకం.
శనివారం మిక్స్‌డ్ ఫైనల్లో సురేఖ జోడీ 152-149 తేడాతో సోఫీ- జీన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. ఆరంభం నుంచి భారత ద్వయం ఆధిపత్యం చలాయించింది. తొలి రౌండ్లో బాణాలను కచ్చితమైన లక్ష్యానికి గురి పెట్టి 40-37తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌లో ప్రత్యర్థి పుంజుకుని ఆ ఆధిక్యాన్ని ఒక్క పాయింట్‌కు తగ్గించింది. మూడో రౌండ్ 39-39తో టైగా ముగిసింది. ఇక కీలకమైన నాలుగో రౌండ్లో సురేఖ- అభిషేక్ జంట తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా రాణించింది. 37-35తో ఆధిక్యంలో నిలిచి పసిడి పట్టేసింది.