ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమ్‌ఇండియా రెండో వన్డేలో వంద పరుగుల తేడాతో ఓడి డీలాపడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 110 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో తన బలహీనతలను బయటపెట్టుకొని 146 పరుగులకే ఆలౌటై ఘోరపరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో మాంచెస్టర్ వేదికగా ఆదివారం కీలకమైన మూడో వన్డే జరగనుంది. ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను తీసుకెళ్లాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా పుంజుకొని మరీ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్ రసవత్తరంగా ఉండటం మాత్రం ఖాయం..
ఆందోళనకరంగా బ్యాటింగ్:బౌలింగ్‌కు సహకరించిన మొదటి వన్డేలో వికెట్ ఇవ్వకుండా విజయభేరి మోగించిన భారత్.. రెండో వన్డేలో ఘోరంగా దెబ్బతింది. బ్యాటర్లు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. సూర్యకుమార్ (27), హార్దిక్ (29), జడేజా (29)తోపాటు షమీ (23) ఫర్వాలేదనిపించడంతో 146 పరుగులైనా చేయగలిగింది. టాప్‌ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి వన్డేలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (0) తడబాటుకు గురయ్యాడు. ఇంకో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ధాటిగా ఆడేందుకు ప్రయత్నించలేదు. విరాట్ కోహ్లీ (16) కాసేపు దూకుడు ప్రదర్శించినా తన బలహీనతతో ఆఫ్‌స్టంప్ ఆవల పడిన బంతిని వెంటాడి మరీ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటికే ఫామ్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ.. కీలకమైన మూడో వన్డేలోనైనా బ్యాట్‌తో సమాధానం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. రిషభ్ పంత్ కూడా బ్యాట్‌ను ఝుళిపించాల్సిందే.
బౌలింగ్ ఓకే.. కానీ:తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను 110 పరుగులకే చుట్టేసిన భారత బౌలర్లు రెండో వన్డేలో మాత్రం కాస్త పట్టువిడిచారు. సెకండ్ వన్డేలో 150 పరుగుల లోపే ఆరు వికెట్లను పడగొట్టిన టీమ్ఇండియా బౌలర్లు.. టెయిలెండర్లను కూల్చడంలో తప్పటడుగు వేశారు. దీంతో 246 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌కు పోరాడేందుకు అవకాశం ఇచ్చారు. అదే త్వరగానే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసి ఉంటే భారత్ ఓటమిబాట పట్టేది కాదేమో.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లకు కళ్లెం వేస్తేనే సిరీస్‌ను సొంతం చేసుకునే వీలుంది. లేకపోతే ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇంగ్లాండ్‌ను ఆపడం కష్టతరమవుతుంది.