మరో తొంభై తొమ్మిది రోజుల్లో విశ్వక్రీడా సంబరం అంబరాన్ని అంటనుంది. ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్.. ప్రపంచ అథ్లెట్ల సత్తాను పరీక్షించే వేదికగా మారనుంది. జులై 23న ఆరంభమయ్యే ఈ మెగా క్రీడలకు ఇంకా తొంభై తొమ్మిది రోజులే ఉంది. కానీ ఒలింపిక్స్ కార్యరూపం దాల్చాలంటే.. కరోనా కరుణించాలి. ఈ మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టాలి. ఇప్పటికీ వైరస్ అనిశ్చితి పరిస్థితుల్లోనూ ఆ మెగా క్రీడల నిర్వహణ దిశగా అడుగులు సాగుతున్నాయి.
కత్తిమీద సామే..
కొత్త నిబంధనల మధ్యలో, విదేశీ అభిమానుల గైర్హాజరీలో, ఎలాంటి సరదా, సంబరాలు లేని క్రీడా గ్రామం దర్శనమివ్వనుంది. ఈ క్రీడల కోసం అథ్లెట్లు ఎక్కువ రోజులు గడపడానికి వీల్లేకుండా.. తమ విభాగాల్లో పోటీ ముగియగానే జపాన్ విడిచేలా అందుబాటులోకి తేనున్న కొత్త షరతుల మధ్య క్రీడల నిర్వహణ కత్తి మీద సామే. ఒలింపిక్స్, పారాలింపిక్స్ కలిపి మొత్తం సుమారు 15,400 మంది అథ్లెట్లు జపాన్ రానున్నారు. వాళ్లతో పాటు వేల సంఖ్యలో ప్రతినిధులు, న్యాయనిర్ణేతలు, మీడియా, ప్రసారదారు సిబ్బంది కూడా ఉండనున్నారు.