టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా పురుషుల జట్టు కెప్టెన్‌గా మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధికారికంగా వెల్లడించింది. వైస్ కెప్టెన్లుగా సీనియర్ డిఫెండర్లు బిరేంద్ర లక్రా, హర్మన్‌ప్రీత్ సింగ్ పేర్లను ప్రకటించింది.
"ఒలింపిక్స్ క్రీడలు ప్రత్యేకమైనవి. అటువంటి గేమ్స్‌లో పురుషుల హాకీ జట్టును నడిపించే బాధ్యత ఇవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మొత్తంగా ఒలింపిక్స్‌లో మూడో సారి పాల్గొనబోతున్నా. ఈసారి సారథిగా జట్టును నడిపించనున్నాను. ఈ అవకాశం నాకు గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా మా టీమ్ బలమైన నాయకత్వమైన సమూహంగా తయారైంది. మహమ్మారి విసిరిన సవాళ్లను విజయవంతంగా అధిగమించి ఈ స్థితికి వచ్చాము. ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా."
-మన్‌ప్రీత్ సింగ్, భారత హాకీ జట్టు కెప్టెన్.
గత నాలుగేళ్లుగా మన్‌ప్రీత్ సారథ్యంలో భారత జట్టు కొన్ని మైలురాళ్లను అధిగమించింది. అందులో 2017 ఆసియా కప్‌తో పాటు 2018 ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్‌ను గెలుచుకుంది. 2018లో భువనేశ్వర్ వేదికగా ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరింది మన్‌ప్రీత్ సేన. 2020లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లోనూ భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. మన్‌ప్రీత్ నేతృత్వంలో ర్యాంకింగ్స్‌లోనూ అత్యుత్తమ స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు నాలుగో ర్యాంకులో ఉంది.