తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా పసిడి ఆశలు ఆవిరి.. కాంస్య పోరుకు సై

టోక్యో ఒలింపిక్స్​లో భాగంగా బెల్జియంతో జరిగిన హాకీ సెమీ ఫైనల్ మ్యాచ్​లో ఓటమిపాలైంది భారత జట్టు. అయితే భారత్​కు కాంస్య పతకం గెలిచే వీలుంది. కనీసం అందులోనైనా భారత జట్టు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

hockey
హాకీ

By

Published : Aug 3, 2021, 12:22 PM IST

Updated : Aug 3, 2021, 2:03 PM IST

హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. మన్‌ప్రీత్‌ సేన పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయింది. సువర్ణాధ్యాయం లిఖించే అవకాశం చేజార్చుకుంది. రజతమైనా సరే మురిసిపోదాం అనుకుంటే..! సెమీస్‌లోనే పురుషుల జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆశలన్నీ కాంస్య పతకంపైనే..! ఆఖరి నిమిషం వరకు పోరాడిన టీమ్‌ఇండియా కంచు పోరులోనైనా 41 ఏళ్ల పతకాల కరవుకు తెరదించాలి.

చిత్తు చేసిన ఒత్తిడి

ఒత్తిడి.. ఒత్తిడి.. ఒత్తిడి.. బెల్జియంతో సెమీస్‌ పోరులో ఒత్తిడే రాజ్యమేలింది! 49 ఏళ్ల తర్వాత అతిపెద్ద పోరులో టీమ్‌ఇండియా ఒత్తిడికి తలొగ్గింది. నరాలు మెలేసే ఆ ఒత్తిడిని జయించిన ప్రపంచ నంబర్‌వన్‌ బెల్జియం 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆశలను ఆవిరి చేసింది. మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ప్రీత్‌ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌తో టీమ్‌ఇండియా కలలను చిదిమేశాడు.

తొలి క్వార్టర్‌ 2-1తో భారత్‌దే

ఆట ఆరంభించిన రెండో నిమిషంలోనే లుయిపెర్ట్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి బెల్జియంకు శుభారంభం అందించాడు. ఏడో నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 1-1తో స్కోరు సమం చేశాడు. మరో రెండు నిమిషాలకే మన్​దీప్ సింగ్‌ (9 ని) అద్భుతమైన ఫీల్డ్‌గోల్‌ చేసి 2-1తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. డిఫెన్స్‌లో కాస్త తడబడిన టీమ్‌ఇండియా బెల్జియంకు ఎక్కువ పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు ఇచ్చింది. ఆ జట్టుకు 14 సార్లు పీసీలు దక్కాయి. 19వ నిమిషంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు రావడంతో హెండ్రిక్స్‌ మూడో దఫాలో గోల్‌ కొట్టేసి 2-2తో స్కోరు సమం చేశాడు.

మూడో క్వార్టర్‌ వరకు హోరాహోరీ

మూడో క్వార్టర్లో రెండు జట్లు గోల్‌ చేసేందుకు శ్రమించాయి. నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. రెండు జట్లూ దూకుడుగా ఆడటంతో ఆట ఉత్కంఠకరంగా సాగింది. బంతిని బాగానే అదుపులో ఉంచుకున్న టీమ్‌ఇండియా గోల్స్‌ కోసం ప్రయత్నించింది. అయితే బెల్జియం మిడ్‌ ఫీల్డర్లు, మిగతా ఆటగాళ్లు సర్కిల్‌ను చుట్టుముట్టి గోల్స్‌ కాకుండా అడ్డుకున్నారు. భారత్‌కు వచ్చిన ఐదు పెనాల్టీ కార్నర్లలో ఒకటే విజయవంతం కావడంతో స్కోరు చేసేందుకు అవకాశం దొరకలేదు.

ఆఖర్లో కొంపముంచిన పెనాల్టీ కార్నర్​లు

నాలుగో క్వార్టర్‌ను 2-2తో మొదలు పెట్టిన రెండు జట్లు ఒత్తిడిలోనే ఆడాయి. అయితే టీమ్‌ఇండియా పదేపదే బంతిని అడ్డుకోవడం వల్ల బెల్జియంకు ఆయాచితంగా వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. మరోసారి హెండ్రిక్స్‌ ఒక పీసీని, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలవడం వల్ల బెల్జియం 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. సమయం తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరిగిన టీమ్‌ఇండియా గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌నూ మైదానంలోకి దింపింది. అయితే దుర్భేద్యమైన డిఫెన్స్‌తో బెల్జియం మన్‌ప్రీత్‌ సేనను అడ్డుకుంది. ఇక ఆట ముగిసే ఆఖరి సెకన్లోనూ దొహెమన్‌ గోల్‌ చేసి బెల్జియంను 5-2తో గెలిపించాడు. ఇక టీమ్‌ఇండియా కాంస్య పోరులోనైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి:భారత్ గర్విస్తోంది.. హాకీ ఆటగాళ్లకు మోదీ సందేశం

Last Updated : Aug 3, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details