తెలంగాణ

telangana

ETV Bharat / sports

బల్బీర్ ఆట చిరస్మరణీయం.. వ్యక్తిత్వం అనుసరణీయం - బల్బీర్ సింగ్ ఆట చిరస్మరణీయం

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూశారు. సోమవారం ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తన ఆటతో భారత్​కు చిరస్మరణీయ విజయాలనందించిన ఆయనకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

హాకీ
హాకీ

By

Published : May 25, 2020, 4:00 PM IST

భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత సీనియర్‌ బల్బీర్‌ సింగ్‌(95) మృతిచెందడంపై పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో బల్బీర్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.

భారత హాకీ జట్టుకు బల్బీర్​ ప్రాతినిధ్యం వహించే సమయంలో దేశమంతా బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ హాకీ. క్రికెట్​ కంటే ముందు దేశప్రజలు ఇష్టపడిన ఆట. హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ రిటైర్​మెంట్​ ప్రకటించిన తర్వాత బల్బీర్​.. భారత హాకీలో కొత్త ఆశలను చిగురింపజేశారు.

బల్బీర్​.. ఇతర అథ్లెట్లపై ఎంతో గౌరవాన్ని చూపించేవారు. కానీ, ఒలింపిక్స్​లో తన విజయాల గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పుకోలేదు. ఆయన కెరీర్​లో సాధించిన పలు విజయాలేంటో తెలుసుకుందాం.

బల్బీర్ సింగ్

ధ్యాన్​చంద్​ నుంచి ప్రేరణ

పంజాబ్​లోని జలంధర్​లో 1923 డిసెంబరు 31న జన్మించారు బల్బీర్​ సింగ్​. ధ్యాన్​చంద్​ జట్టు ఒలింపిక్స్​లో వరుసగా మూడు పతకాలు సాధించిన తర్వాత హాకీలో అడుగుపెట్టాలని బల్బీర్​ నిశ్చయించుకున్నారు. బల్బీర్​ 13 ఏళ్లు ఉండగా.. 1936 బెర్లిన్​ ఒలింపిక్స్​లో ధ్యాన్​చంద్​ పతకం సాధించారు. భారత మాజీ హాకీ ప్లేయర్​ హర్​బలీ సింగ్​.. బల్బీర్​లోని ప్రతిభను గమనించి ఆయనకు హకీలో మెళకువలు నేర్పించారు.

విజేతగా స్వదేశంలో అడుగుపెట్టి

ఒలింపిక్స్​లో తొలి స్వర్ణం

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆడిన తొలి ఒలింపిక్స్​లో పసిడిని నెగ్గింది భారత హాకీ జట్టు. బల్బీర్​కు కూడా ఇది తొలి బంగారు పతకం. 1948 లండన్​ ఒలింపిక్స్ హాకీ పోటీల్లో గ్రేట్​ బ్రిటన్​తో జరిగిన తుదిపోరులో 4-0 పాయింట్లతో విజయం సాధించింది. ఒలింపిక్స్​లో భారత్​కిది వరుసగా నాలుగో పసిడి విజయం.

ఆ తర్వాత జరిగిన 1952 హెల్సింకి ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు బల్బీర్​ వైస్​ కెప్టెన్​గా నియమించబడ్డారు. గ్రేట్​ బ్రిటన్​పై జరిగిన సెమీస్​లో హ్యాట్రిక్​ గోల్స్​ చేయగా.. నెదర్లాండ్స్​తో జరిగిన తుదిపోరులో ఐదు గోల్స్​ చేసి జట్టు విజయానికి సహకరించారు. ఆ మ్యాచ్​లో నెదర్లాండ్స్​పై 6-1 పాయింట్లతో ఒలింపిక్స్​లో రెండో స్వర్ణ పతకాన్ని అందుకున్నారు బల్బీర్​. ఒలింపిక్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత గోల్స్​ సాధించిన బల్బీర్​ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇది గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది.

బల్బీర్

ఒలింపిక్స్​ స్వర్ణంలో హ్యాట్రిక్​

మెల్​బోర్న్​ వేదికగా 1956లో జరిగిన ఒలిపింక్స్​లో బల్బీర్​.. భారత హాకీ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించారు. ఆరంభ కార్యక్రమంలో భారతదేశ దళానికి జెండా మోసే వ్యక్తిగా ఎంపికయ్యారు. భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తొలిసారి ఒలింపిక్స్​ ఫైనల్​లో తలపడ్డారు. అందులో 1-0 పాయింట్లతో భారత్ గెలిచింది. వరుసగా మూడోసారి పసిడిని సాధించారు బల్బీర్. ఆ విజయాన్ని అందుకుని స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు రాజకీయ నాయకులు ప్రత్యేక స్వాగతం పలికారు.

విజేతగా స్వదేశంలో అడుగుపెట్టి

హాకీ ప్రపంచ విజేత జట్టు మేనేజర్

1975 హాకీ ప్రపంచకప్‌లో బంగారు పతకం సాధించిన భారత జట్టుకు బల్బీర్ సీనియర్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు ఇదే పసిడి విజయం.

పురస్కారాలు

హాకీ నుంచి రిటైర్​మెంట్​ పొందిన తర్వాత బల్బీర్​ను పలు అవార్డులు వరించాయి. 1957లో భారత ప్రభుత్వం నుంచి క్రీడా విభాగంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2006లో పంజాబ్​ ప్రభుత్వం నుంచి 'ఉత్తమ సిక్ హాకీ ఆటగాడు' పురస్కారాన్ని పొందారు. 2015లో ధ్యాన్​చంద్​ లైఫ్​టైమ్​ అవార్డుతో బల్బీర్​ను సత్కరించారు.

గిన్నిస్ పురస్కారం

1947-58

బల్బీర్ 1947 నుంచి 1958 వరకు హాకీ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 61 మ్యాచ్​లు ఆడి 246 గోల్స్ సాధించారు. ప్రస్తుతం బల్బీర్ మన మధ్య లేకపోయినా.. ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details