తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హాకీ దిగ్గజం బల్బీర్​కు​ భారతరత్న ఇవ్వండి'

భారత్​ను హాకీలో 3 సార్లు ఛాంపియన్​గా నిలిపి.. ఒలింపిక్స్​లో స్వర్ణాన్ని అందించిన బల్బీర్​ సింగ్ సీనియర్​కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్​. హాకీ దిగ్గజాన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సిఫార్సు చేసినందుకు పంజాబ్​ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మోదీ.

"హాకీ దిగ్గజం బల్బీర్​కు​ భారతరత్న ఇవ్వండి"

By

Published : Aug 23, 2019, 7:00 AM IST

Updated : Sep 27, 2019, 11:04 PM IST

హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్​కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. స్వతంత్ర భారతంలోనే ప్రముఖ క్రీడా దిగ్గజం బల్బీర్ సింగ్ అని.. ఆయనకు ఆ అవార్డు బహూకరించాలని కోరారు.

"దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు బల్బీర్ సింగ్. ఆయనపై మీరు దృష్టిపెట్టాలి. క్రీడా సమాజానికి ఆయన చేసిన సేవకుగానూ భారతరత్నతో సత్కరించాలి. ఒలింపిక్స్​లో భారత్​ను మూడు సార్లు ఛాంపియన్​గా నిలిపిన వారిలో బల్బీర్ ఒకరు. 1957లో పద్మశ్రీ ఇచ్చారు.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నా" -అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

పంజాబ్ సీఎం లేఖకు ట్విట్టర్​లో బదులిచ్చారు ప్రధాని మోదీ.

"క్రీడాకారులను గుర్తించి గౌరవించాలనుకోవడం ఎంతో ఆనందదాయకం. క్రీడాకారుడిగా, కోచ్​గా, మేనేజర్​గా ఎన్నో విభాగాల్లో సేవలందించిన బల్బీర్​ సింగ్ పేరును సిఫార్సు చేసినందుకు కెప్టెన్ అమరీందర్​ సింగ్​.. మీకు ధన్యవాదాలు" -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.

మోదీ ట్వీట్​కు ప్రతిస్పందనగా మరో ట్వీట్ చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి

"క్రీడా సమాజానికి ఎనలేని కృషి చేసిన బల్బీర్​ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని మరొక్కసారి కోరుకుంటున్నా. సెంటర్​ ఫార్వర్డ్​లో ఆయన ఎంతో గొప్ప ప్లేయర్. 1948, 1952, 1956లో భారత్ స్వర్ణ పతకాలు గెలవడంలో బల్బీర్ కీలకపాత్ర పోషించారు"​ -అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి.

ప్రపంచ మేటీ ప్లేయర్లలో ఒకరు..

బల్బీర్ సింగ్ సీనియర్.. భారత్​ గర్వించదగ్గ హాకీ ప్లేయర్లలో ముందు వరుసలో ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా 16 మంది గొప్ప హాకీ క్రీడాకారులను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఎంపిక చేయగా.. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు బల్బీర్ సింగ్.

1952 హెల్సింకీ ఒలింపిక్స్​ హాకీ ఈవెంట్​లో భారత్​.. నెదర్లాండ్స్​పై ​ 6-1 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్​లో బల్బీర్ ఒక్కరే 5 గోల్స్ చేశారు.

1975 ప్రపంచకప్​లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు మేనేజర్​గానూ సేవలందించారు బల్బీర్​. ఈయనను 1957లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.

గత నెలలో నిమోనియా కారణంగా చండీగఢ్​లోని ఆసుపత్రిలో చేరారు 95 ఏళ్ల బల్బీర్ సింగ్. అనంతరం ఆరోగ్యం మెరుగైందని.. ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యారని ఆయన మనవడు కబీర్​సింగ్ తెలిపారు.

ఇది చదవండి: విజయోత్సాహంలో జారిపడ్డ దేశాధ్యక్షుడు

Last Updated : Sep 27, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details