తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు.. ఈ చంద్రుడు - National Sports Day awards

ఆయన హాకీ ఆడుతుంటే ప్రేక్షకులు మ్యాజిక్​ షోకు వచ్చామని అనుకుంటారు. మైదానంలో హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడిలా ప్రత్యర్థులను మాయ చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించేవారు.. ఆయనే భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్. ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా భారత గొప్ప క్రీడాకారుడి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.

హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు.. ఈ చంద్రుడు
ధ్యాన్​చంద్ పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవం

By

Published : Aug 29, 2020, 9:56 AM IST

"క్రికెట్​లో బ్యాట్స్​మెన్ పరుగులు చేసినట్లు.. హాకీలో గోల్స్​ చేశాడు" అంటూ దిగ్గజ క్రికెటర్ సర్​ డాన్​ బ్రాడ్​మన్​ కితాబు అందుకున్న భారత లెజెండరీ హాకీ ఆటగాడు ధ్యాన్​చంద్​. మైదానంలో అడుగుపెట్టాడంటే ఆయన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు మల్లగుల్లాలు పడేవాళ్లు. 1928,32,36 ఒలింపిక్స్​లలో భారత జట్టుకు స్వర్ణాలు సాధించిపెట్టారు. ఆయన ఆటను చూస్తూ స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు. ధ్యాన్​చంద్​కు నివాళిగా ఏటా ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్

ధ్యాన్​చంద్​కు ఆ పేరు ఎలా వచ్చిదంటే..

1905లో జన్మించిన ధ్యాన్​చంద్ అసలు పేరు ధ్యాన్​సింగ్​. 16వ ఏటనే సైన్యంలో చేరిన ఆయన హాకీపై మక్కువతో రాత్రి వేళల్లో ప్రాక్టీస్​ చేసేవారట. అప్పుడు ఆయన సహచరులు 'చాంద్' అని పిలవడం మొదలు పెట్టారట. చాంద్ అంటే హిందీలో చంద్రుడు అని అర్థం. క్రమేణా ఆ పేరు కాస్త ధ్యాన్​చంద్​గా మారింది. ఈ విధంగా రాత్రిపూట ఉదయించే చంద్రుడిలా ధ్యాన్​సింగ్​ పేరు కాస్త ధ్యాన్​చంద్​గా రూపాంతరం చెందింది.

హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు..

1928 ఆమ్​స్టర్​డామ్​ ఒలింపిక్స్​లో ధ్యాన్​చంద్ 14 గోల్స్​ చేసి.. భారత జట్టు అప్రతిహత జైత్రయాత్రకు కారణమయ్యాడు. ఆయన ఆటకు ముగ్ధులైన ఓ అంతర్జాతీయ వార్తాప్రత్రిక "ఇది హాకీ కాదు.. మ్యాజిక్​.. ధ్యాన్​చంద్​ హకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు" అంటూ కథనంలో ప్రచురించింది.

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్

హాకీ ట్విన్స్​

1932 ఒలింపిక్స్​లో అమెరికాపై 24-1, జపాన్​పై 11-1 తేడాతో ఘన విజయాల్ని సొంతం చేసుకుంది భారత హాకీ జట్టు. ఈ రెండు మ్యాచ్​ల్లో నమోదైన 35 గోల్స్​లో ధ్యాన్​చంద్ 12, ఆయన సోదరుడు రూప్ సింగ్​ 13 గోల్స్​ చేసి హాకీ కవల సోదరులుగా(హాకీ ట్విన్స్​)గా పేరు గడించారు.

గోల్​ పోస్ట్​ తప్పుడు ప్రమాణం..

ఓ మ్యాచ్​లో ధ్యాన్​చంద్ ఒక్క గోల్​ కూడా చేయలేదు. గోల్​ పోస్ట్​ కొలత తప్పుగా ఉందంటూ మ్యాచ్​ రిఫరీతో వాదనకు దిగాడు. అందరూ ధ్యాన్​చంద్​ను తప్పుపట్టారు. ఇందులో ఆశ్చర్యమేమంటే నిజంగానే గోల్​పోస్ట్​ అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువ వెడల్పుతో ఉంది.

బెర్లిన్​లో మ్యాజిక్​ షో..

1936 బెర్లిన్​ ఒలింపిక్స్​ సమయంలో ధ్యాన్​చంద్ కీర్తి మరింత పెరిగింది. 'ఒలింపిక్స్​ స్టేడియంలో మ్యాజిక్ షో జరగబోతుంది. భారత హాకీ మాంత్రికుడు తన మాయాజాలంతో ఆకట్టుకోబోతున్నాడు' అంటూ బెర్లిన్ నగరంలోని గోడలన్నింటిపై పోస్టర్లు అతికించారు.

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్

హిట్లర్ ఆఫర్​ తిరస్కరణ..

ధ్యాన్​చంద్​ ఆటకు ప్రభావితుడైన జర్మన్ నియంత అడాల్ఫ్​ హిట్లర్​.. జర్మన్ పౌరసత్వంతో పాటు.. సైన్యంలో కీలక పదవిని ఇస్తానని ఆయన ముందు ప్రతిపాదన తెచ్చాడు. హిట్లర్​ ఆఫర్​ను తిరస్కరించిన హాకీ దిగ్గజం తాను మరణించేంతవరకు భారతీయుడిగానే ఉంటానని తెలిపారు.

ముగ్ధుడైన బ్రాడ్​మన్​..

1935లో ఆస్ట్రేలియాలో పర్యటించింది భారత హాకీ జట్టు. మొత్తం 43 మ్యాచ్​ల్లో భారత్​ 584 గోల్స్​ చేసింది. అందులో ధ్యాన్​చంద్ ఒక్కడే 201 గోల్స్​ నమోదు చేశాడు. "క్రికెట్​లో బ్యాట్స్​మెన్​ పరుగులు చేసినట్లు హాకీలో గోల్స్​ చేశాడు" అంటూ ధ్యాన్​చంద్​ను ప్రశంసించాడు ఆ టోర్నీకి హాజరైన క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్​మన్.

హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్

హాకీ కర్ర విరగ్గొట్టారు..

ధ్యాన్​చంద్ ఆటను చూసి ఆశ్చర్యపోయిన నెదర్లాండ్​ హాకీ అధికారులు ఆయన హాకీ కర్రలో అయస్కాంతం ఉందేమోనని విరగ్గొట్టి మరీ పరీక్షించారు.

1922 నుంచి 1948 వరకు భారత హాకీ క్రీడాకారుడిగా సేవలందించారు ధ్యాన్​చంద్. 22 ఏళ్ల కెరీర్​లో మొత్తం 400 గోల్స్​ చేశారు.

ధ్యాన్​చంద్​కు నివాళిగా ఆయన పుట్టినరోజున 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. వివిధ ఆటల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులు, శిక్షకులకు ఈ రోజునే క్రీడాపురస్కారాలు ప్రదానం చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details