టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు.. ట్విట్టర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్మనీ హాకీ జట్టు పైన భారత జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంపై మంత్రి కేటీఆర్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర రాసి.. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ ప్రశంసించారు.
నాలుగు దశాబ్దాల ఎదురుచూపు
41 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు పతకం లభించింది. ఒలింపిక్స్ కెరీర్లోనే భారత్కు ఇది 12వ పతకం.1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన ఇండియన్ హాకీ టీమ్.. నాలుగు దశాబ్దాల తర్వాత కాంస్యం చేజిక్కించుకుంది. పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా తన సత్తా చాటింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను రేపుతూ పునర్వైభవమే లక్ష్యంగా అద్భుత విజయం సాధించింది. జర్మనీని 5-4 తేడాతో ఓడించి.. కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది.