అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వార్షిక అవార్డులకు ముగ్గురు భారత క్రీడాకారులు నామినేట్ అయ్యారు. భారత సీనియర్ పురుషుల జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్స్‌లో రష్యాపై భారత్ 11-3 తేడాతో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ విజయంలో మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు వివేక్ ప్రసాద్, లాల్‌రెమ్‌సియామి కూడా అవార్డుల రేసులో నిలిచారు.
గతేడాది యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వివేక్ 'రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (అండర్-23)' అవార్డుకు నామినేట్ అయ్యాడు. అలాగే ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించిన లాల్‌రెమ్‌సియామి 'మహిళా రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (అండర్-23)' అవార్డుకు నామినేట్ అయ్యింది.