భారత స్టార్ హాకీ ప్లేయర్, మహిళా జట్టు సారథి రాణి రాంపాల్ అరుదైన పురస్కారానికి ఎంపికైంది. 2019కి గానూ ప్రకటించే వరల్డ్ గేమ్స్ 'అథ్లెట్ ఆఫ్ ద ఇయర్' అవార్డును ఆమె కైవసం చేసుకుంది. పలు క్రీడలకు చెందిన దాదాపు 25 మంది ఆటగాళ్లు ఈ అవార్డుకు నామినేట్ అవగా... ప్రజల ఓట్ల ద్వారా తొలిస్థానంలో నిలిచింది రాణి. ఆమెకు లక్షా 99వేల 477 ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు నిర్వహకులు.
అథ్లెట్‌గా లేదా జట్టు తరఫున బరిలోకి దిగి క్రీడల్లో అద్భుతంగా రాణించిన వారికి ఈ అవార్డు ఇస్తోంది ప్రపంచ క్రీడా సమాఖ్య(డబ్ల్యూజీఏ). ఈ ఏడాది 6వ ఎడిషన్ పోటీల్లో భాగంగా 20 రోజుల పాటు ఈ పోలింగ్ జరిగింది. ఇందులోమొత్తం 7 లక్షల 5వేల 610 మంది ఓట్లు వేశారు.
టోక్యో సారథిగా...
2020 టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న 'ఉమెన్ ఇన్ బ్లూ' హాకీ జట్టుకు సారథ్యం వహించనుందిరాణి. భారత్ ఈ మెగాటోర్నీకి అర్హత సాధించడంలో ఈ స్టార్ ప్లేయర్ కీలకపాత్ర పోషించింది.
గతేడాది ఏక్రోబాటిక్ జిమ్నాస్టిక్స్ జంట మారియా చెర్నోవా, జార్జీ పటరాయ్(రష్యా)కు ఈ అవార్డు లభించింది. లక్షా 59 వేల ఓట్లతో టైటిల్ గెలుచుకుందీ జోడీ. అమెరికాకు చెందిన పవర్ లిఫ్టర్ జెన్నిఫర్ థామ్సన్ లక్ష 52 వేల పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరి రికార్డులను ఈ ఏడాది బ్రేక్ చేసింది రాణి రాంపాల్.
ఎవరీ రాణి...?
హరియాణాలోని షాహ్‌బాద్‌కు చెందిన రాణి రాంపాల్.. పేద కుటుంబం నుంచి వచ్చింది. నాన్న రిక్షా నడిపేవాడు. తమ రాష్ట్రంలో హాకీకి మంచి ఆదరణ ఉండడం, చుట్టూ అంతా హాకీ ఆడడం వల్ల చిన్నప్పుడే రాణి స్టిక్ పట్టింది. ద్రోణాచార్య బల్‌దేవ్‌సింగ్ శిక్షణలో రాటుదేలింది. రాష్ట్ర, జాతీయ టోర్నీల్లో సత్తా చాటిన ఆమెకు... 14 ఏళ్ల వయసులో భారత జట్టులో ఆడే అవకాశం దక్కింది. ఆమె తొలి టోర్నీనే 2008 ఒలింపిక్స్ క్వాలిఫయర్స్. 2010 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆమె.. ఈ టోర్నీ ఆడిన పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ టోర్నీలో 7 గోల్స్ చేసి అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్యతలూ చేపట్టింది.
ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగింది.గాయాలు, అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందిపడిన రాణి కెరటంలా ఎగిసిపడి భారత్‌ను టోక్యో ఒలింపిక్స్ చేర్చింది. రియో ఒలింపిక్స్ ముందు జరిగిన క్వాలిఫయర్స్‌లో భాగంగా రష్యాపై కీలక సమయంలో గోల్‌తో జట్టును చాలా ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ (రియో) మెట్టు ఎక్కించింది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో అమెరికాతో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో గోల్ చేసి జట్టుకు ఒలింపిక్స్ బెర్తు సంపాదించి పెట్టింది. హాకీలో ఈమె చేసిన సేవలను గుర్తిస్తూ ఇప్పటికే 'అర్జున', 'పద్మ శ్రీ' అవార్డులను ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.