షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) జరిగితే భారత పురుషుల హాకీ జట్టు పతకం తెస్తుందని బలంగా నమ్ముతున్నట్లు హాకీ స్టార్ స్ట్రయికర్ యువరాజ్ వాల్మీకి(Yuvraj Walmiki) అన్నాడు.
"మన్‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పుడు గొప్పగా రాణిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ అనుకున్నట్లు నిర్వహిస్తే మన బృందానికి ఈసారి పతకం ఖాయమని నా మనసు బలంగా చెబుతోంది."
- యువరాజ్ వాల్మీకి, హాకీ స్టార్ స్ట్రయికర్
ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 8 స్వర్ణ పతకాలు గెలిచిన ఘన చరిత్ర ఉన్న భారత్.. చివరిగా 1980 మాస్కో ఒలింపిక్స్(moscow olympics 1980)లో పతకం (స్వర్ణం) సాధించింది. ముంబయిలోని ఒక మురికివాడలో కనీసం విద్యుత్తు, నీళ్లు లేని ఇంట్లో పెరిగిన యువరాజ్ 2011లో ఛాంపియన్స్ ట్రోఫీతో వెలుగులోకి వచ్చాడు. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఫైనల్లో పాకిస్థాన్‌పై జట్టు విజయంలో అతడిది కీలకపాత్ర.
భారత జట్టుకు ఆడడం వల్ల తన జీవితం మారిపోయిందని.. వ్యక్తిగానూ ఎంతో ఎదిగినట్లు యువరాజ్ వాల్మీకి చెప్పాడు. "పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైంది. ఆ సమయంలో మా వ్యూహాల కన్నా భావోద్వేగాలే ఎక్కువ పని చేశాయి. భారత్‌కు ఆడడం వల్ల వ్యక్తిగానూ ఎంతో ఎదిగా" అని వాల్మీకి చెప్పాడు. హాకీలోనే కాదు వినోద రంగంలోనూ యువరాజ్ మెరిశాడు. వెబ్ సిరీస్‌లతో పాటు రియాల్టీ షోల్లోనూ నటించాడు.
ఇదీ చూడండి:విధుల నుంచి తప్పుకున్న 10 వేల మంది వాలంటీర్లు