ఒలింపిక్స్ హాకీలో భారత్ పతకం సాధించి నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. చివరిసారిగా 1980 మాస్కో క్రీడల్లో పురుషుల జట్టు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి మన ఆట ప్రమాణాలు పడిపోతూ వచ్చాయి. ప్రపంచ హాకీలో మన ఆధిపత్యానికి బీటలు వారాయి. ఓ దశలో భారత్ హాకీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే పెద్ద ఘనతగా మారింది. కానీ ఈ సారి భారత పురుషులు, మహిళల హాకీ జట్లు మంచి అంచనాలతోనే బరిలోకి దిగుతున్నాయి.
కరవు తీర్చాలని..
భారత హాకీ పేరు చెప్పగానే అందరకీ గతమే గుర్తుకు వస్తుంది. ఆ విషయంలో మార్పు తెచ్చేందుకు 41 ఏళ్ల పతక కరవును తీర్చేందుకు భారత పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. గత కొన్ని ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈ విశ్వ క్రీడలకు ముందు భారత్ (4వ ర్యాంకు) అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తోంది. మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని జట్టు విజయాల వైపు ఉరకలేసే ఉత్సాహంతో ఉంది. గత రియో ఒలింపిక్స్‌ను 8వ స్థానంతో ముగించి నిరాశ కలిగించిన జట్టు.. ఈ టోక్యో క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన కోసం గత మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. అటాకింగ్‌లో మరింత దూకుడు జతచేసి.. డిఫెన్స్‌ను మరింత పటిష్ఠంగా మలుచుకుని ఈ క్రీడలకు సిద్ధమైంది.
ఈ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో బరిలో దిగనున్న దేశాల్లో కెనడా(ఆడే అవకాశం రాలేదు)పై మినహా మిగతా అన్ని జట్లపైనా గత రెండేళ్లలో భారత్ విజయాలు సాధించడం గొప్ప సానుకూలాంశం. ప్రపంచ అగ్రశ్రేణి జట్లైన బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, అర్జెంటీనాలపై మన జట్టు పైచేయి సాధించింది. ఒలింపిక్స్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలనే ధ్యేయంతో ఉంది. అయితే డ్రా కఠినంగా ఉండడం ఓ ప్రతికూలత. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, స్పెయిన్, న్యూజిలాండ్, ఆతిథ్య జపాన్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఈ నెల 24న తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఈ రెండు బలమైన జట్లపై గెలిచి.. ఒలింపిక్స్‌ను గొప్పగా ఆరంభిస్తే ఇక మన జట్టుకు తిరుగుండదు.
ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్ బరిలో దిగనున్న సారథి మన్‌ప్రీత్, సీనియర్ గోల్‌కీపర్ శ్రీజేష్‌తో పాటు హర్మన్‌ప్రీత్ సింగ్, బిరేంద్ర లక్రా జట్టులో కీలకం కానున్నారు. ఇక వీళ్లతో పాటు ఒలింపిక్స్‌కు తొలిసారి ఎంపికైన 10 మంది యువ ఆటగాళ్లు సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నారు. కనీసం క్వార్టర్స్ చేరుతుందనే అంచనాలు ఉన్న జట్టు.. అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తే పతకం గెలవగలదు.
కొత్త ఉత్సాహంతో..
రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత మహిళల హాకీ జట్టు చాలా ఉత్సాహంగా ఉంది. శారీరక ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకుని.. మానసికంగా బలాన్ని పెంచుకుని ఒలింపిక్స్‌లో అడుగుపెట్టబోతున్న ఈ జట్టు, పతకం సాధించి.. ఈ మెగా క్రీడల్లో అమ్మాయిల హాకీలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన జట్టుగా చరిత్ర సృష్టించాలనే దృఢ సంకల్పంతో ఉంది. భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి మాత్రమే. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడిన భారత అమ్మాయిలు.. 36 ఏళ్ల విరామం తర్వాత గత ఒలింపిక్స్‌లో రెండోసారి పొటీ పదో స్థానంలో నిలిచారు. ఈసారి మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నారు. గత కొన్నేళ్లలో జట్టు ఆటతీరు మెరుగైంది. 2018 ఆసియా క్రీడల్లో రజతంతో పాటు ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడల్లోనూ మంచి ప్రదర్శన చేసింది. ఒలింపిక్స్‌కు ముందు అగ్రశ్రేణి జట్లు గ్రేట్ బ్రిటన్, న్యూజిలాండ్, స్పెయిన్‌పై విజయాలు.. జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే.
మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ కెప్టెన్ రాణి ఆ జట్టుకు పెద్ద బలం. ఆమెతో పాటు వందన, దీప్ గ్రేస్, సవిత జట్టుకు కీలకం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న భారత్.. నెదర్లాండ్స్ (1వ ర్యాంక్), జర్మనీ (3), గ్రేట్ బ్రిటన్ (5), ఐర్లాండ్ (8), దక్షిణాఫ్రికా (16)తో కలిసి గ్రూప్- ఎలో ఉంది. 24న తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పోటీపడనుంది. ప్రత్యర్థులు పటిష్ఠంగానే ఉన్నప్పటికీ.. భారత్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
- ఒలింపిక్స్ హాకీలో భారత పురుషుల హాకీ జట్టు 1928 మొదలు 1956 వరకు వరుసగా ఆరు స్వర్ణాలు గెలిచింది. 1960 రోమ్ క్రీడల్లో రజతం గెలిచిన జట్టు.. తిరిగి 1964 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడింది. 1968, 1972 ఒలింపిక్స్‌ల్లో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 1976లో అనూహ్యంగా ఏడో స్థానంతో ముగించి వట్టి చేతులతోనే తిరిగొచ్చింది. ఇక 1980 మాస్కో క్రీడల్లో మరోసారి ఆధిపత్యం చలాయించి రికార్డు స్థాయిలో ఎనిమిదో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ హాకీలో భారత్ మరో పతకాన్ని గెలవలేకపోయింది. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణాలు సొంతం చేసుకున్న రికార్డు భారత్ పేరు మీదే ఉంది. రెండో స్థానంలో జర్మనీ (4) ఉంది.
హాకీ జట్లు
పురుషులు:హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్, బిరేంద్ర (డిఫెండర్లు), హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్, నీలకంఠ శర్మ, సుమిత్ (మిడ్‌ఫీల్డర్లు), షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జాంత్ సింగ్, లలిత్ కుమార్, మన్‌దీప్ సింగ్ (ఫార్వర్డ్), పీఆర్ శ్రీజేష్ (గోల్‌కీపర్).
మహిళలు: గుర్జిత్ కౌర్, దీప్ గ్రేస్, నిక్కీ ప్రధాన్, ఉదిత (డిఫెండర్లు), మోనిక, నిశ, సుశీల, నవ్‌జోత్, సలీమ, నేహ (మిడ్‌ఫీల్డర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), షర్మిల, వందన, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్ (ఫార్వర్డ్), సవిత (గోల్‌కీపర్).
ఇదీ చూడండి:'స్వేచ్ఛగా ఆడితే విజయం మనవెంటే'