21 ఏళ్లలో మరే భారత హాకీ ఆటగాడికి సాధ్యం కాని ఘనతను మన్‌ప్రీత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రదానం చేసే 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు (2019)ను భారత కెప్టెన్ గెలుచుకున్నాడు. 1999లో ఈ అవార్డును ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని కైవసం చేసుకున్న భారత తొలి ఆటగాడు మన్‌ప్రీతే.
ఓట్లతో అగ్రస్థానం..
ప్రపంచ నం.1 బెల్జియం జట్టులోని ఆర్థర్ వాన్ డొరెన్, ప్రపంచ నం.3 అర్జెంటీనాకు చెందిన లూకాస్ విల్లాలను వెనక్కినెట్టి 27 ఏళ్ల మన్‌ప్రీత్ విజేతగా నిలిచాడు. అతడికి 35.2 శాతం ఓట్లు లభించాయి. వాన్ డొరెన్‌కు 19.7, విల్లాకు 16.5 శాతం ఓట్లు వచ్చాయి. జాతీయ సమాఖ్యలు, మీడియా ప్రతినిధులు, అభిమానులు, ఆటగాళ్ల ఓట్ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
2011లో అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్ ఇప్పటివరకు 260 మ్యాచ్‌ల్లో ఆడాడు. లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడీ 27 ఏళ్ల ప్లేయర్. 2019లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో చెలరేగి ఆడిన మన్‌ప్రీత్... భారత్‌కు టోక్యో బెర్త్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఇతడే సారథిగా వ్యవహరించనున్నాడు.