తెలంగాణ

telangana

ETV Bharat / sports

FIH Awards 2021: హాకీ అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం

హాకీ అవార్డుల్లో(FIH Awards 2021) భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని విభాగాల్లోను మన అథ్లెట్లు(Hockey India) అవార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ఈ వార్షిక అవార్డుల ఎంపికలో ఎఫ్‌ఐహెచ్‌ విఫలమైందని, ఓటింగ్‌ పద్ధతి సరిగా లేదంటూ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఛాంపియన్‌ బెల్జియం(Belgium Hockey team) అసంతృప్తి వ్యక్తం చేసింది.

hockey
హాకీ

By

Published : Oct 7, 2021, 7:35 AM IST

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల్లో భారత్‌(Hockey India) ఆధిపత్యం ప్రదర్శించింది. బుధవారం(అక్టోబర్​ 6) ప్రకటించిన అవార్డుల్లో(FIH Awards 2021) అన్ని విభాగాల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. మహిళల్లో గుర్జీత్‌ కౌర్‌ నిలిచారు. ఉత్తమ గోల్‌కీపర్లుగా వెటరన్‌ ఆటగాడు శ్రీజేష్‌ (పురుషుల), సవిత పునియా (మహిళల) అవార్డులు సొంతం చేసుకున్నారు. యువ ప్లేయర్లు వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (పురుషుల), షర్మిల దేవి (మహిళల) ఉత్తమ వర్థమాన స్టార్లుగా నిలిచారు.

ఉత్తమ కోచ్‌లుగా గ్రహమ్‌ రీడ్‌ (పురుషుల), మరీన్‌ (మహిళల) అవార్డులు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో(India Hockey Team in Tokyo Olympics) కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు.. 41 ఏళ్ల తర్వాత హాకీలో దేశానికి పతకం అందించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు పతకానికి అడుగు దూరంలో ఆగిపోయి నాలుగో స్థానంతో సంతృప్తి చెందారు. హర్మన్‌ప్రీత్‌, గుర్జీత్‌ తమ జట్ల తరపున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్లుగా నిలిచారు.

బెల్జియం అసంతృప్తి..

మరోవైపు ఈ వార్షిక అవార్డుల ఎంపికలో ఎఫ్‌ఐహెచ్‌(FIH Awards) విఫలమైందని, ఓటింగ్‌ పద్ధతి సరిగా లేదంటూ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఛాంపియన్‌ బెల్జియం(Belgium Hockey Team) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటింగ్‌ విధానం ద్వారా ఈ అవార్డులకు ప్లేయర్లను ఎంపిక చేస్తారు. తుది ఫలితాలు ప్రకటించేందుకు ఆయా జాతీయ సమాఖ్యల ఓట్లను 50 శాతంగా, అభిమానులు, ఆటగాళ్ల ఓట్లను 25 శాతంగా, మీడియా ఓట్లను 25 శాతంగా పరిగణలోకి తీసుకుంటారు. ఐరోపాకు చెందిన 42 జాతీయ హాకీ సమాఖ్యల్లో 19 మాత్రమే ఓట్లు వేశాయి. అదే ఆసియా విషయానికి వస్తే 33కి గాను 29 సమాఖ్యలు ఓట్లు వేశాయి.

"ఎఫ్‌ఐహెచ్‌ అవార్డుల ప్రకటన పట్ల బెల్జియం తీవ్ర నిరాశ చెందింది. ఒలింపిక్స్‌ స్వర్ణ జట్టులోని ఆటగాళ్లు వివిధ విభాగాల్లో పోటీపడ్డప్పటికీ ఒక్క అవార్డూ దక్కకపోవడం ఓటింగ్‌ విధానం వైఫల్యాన్ని చాటుతోంది" అని బెల్జియం హాకీ సమాఖ్య ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అవసరమనుకుంటే ఈ అవార్డుల ప్రకటనపై సమీక్ష నిర్వహిస్తామని, ఎక్కువ జాతీయ సమాఖ్యలు ఓట్లు వేయకపోవడానికి గల కారణాలపై దృష్టి సారిస్తామని ఎఫ్‌ఐహెచ్‌ ప్రకటన జారీ చేసింది.

ఇదీ చదవండి:Hockey India: కామన్వెల్త్ క్రీడల నుంచి వైదొలిగిన హాకీ ఇండియా

ABOUT THE AUTHOR

...view details