బెంగళూరులోని శిక్షణ శిబిరంలో గత 15 నెలలుగా తాము చాలా కష్టపడ్డామని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చెప్పాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేదని తెలిపాడు. జట్టుగా తామంత పడ్డ కష్టానికి ప్రతిఫలం ఒలింపిక్స్‌లో కాంస్య పతకమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో పలు విషయాలను పంచుకున్నాడు.
సుదీర్ఘ కాలం తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు పతకం వచ్చిందని మన్‌ప్రీత్ తెలిపాడు. టోక్యో నుంచి స్వదేశానికి వచ్చినప్పుడు దిల్లీలో తమకు ఘన స్వాగతం లభించిందని.. ఇది తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.
సెమీస్‌లో ఓటమి అనంతరం తమకు ప్రధాని మోదీ ఫోన్ చేశారని మన్‌ప్రీత్ గుర్తుచేసుకున్నాడు. "జట్టులోని ఆటగాళ్లందరితో పీఎం మాట్లాడారు. దేశం మొత్తం తమతో ఉందని ధైర్యం చెప్పారు. తదుపరి మ్యాచ్ గురించి ఆందోళన చెందొద్దని.. కాంస్య పతక పోరు కోసం సరిగా సన్నద్ధం కావాలని సూచించారు. మ్యాచ్‌లో గెలుపొందాక మరోసారి ప్రధాని ఫోన్ చేశారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందని అన్నారు" అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.