తెలంగాణ

telangana

ETV Bharat / sports

Junior Hockey World Cup: హాకీ ప్రపంచకప్​లో భారత కుర్రాళ్లకు షాక్‌ - జూనియర్ హాకీ ప్రపంచకప్​లో భారత్ ఓటమి

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో(Junior Hockey World Cup 2021) భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫ్రాన్స్ చేతిలో భారత్ 4-5 తేడాతో ఓటమిపాలైంది. భారత్‌ తరఫున సంజయ్‌ సాధించిన హ్యాట్రిక్‌ గోల్స్‌ వృథా అయ్యాయి.

IND vs FRANCE
భారత్ X ఫ్రాన్స్

By

Published : Nov 25, 2021, 7:05 AM IST

Junior Hockey World Cup 2021:జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు షాక్‌ తగిలింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌(India vs France Hockey) (పూల్‌-బి)లో అనూహ్యంగా పరాజయంపాలైంది. బుధవారం ఆసక్తికరంగా జరిగిన పోరులో ప్రపంచ నంబర్‌ 26 ఫ్రాన్స్‌ 5-4తో ఆతిథ్య జట్టును ఓడించింది. భారత్‌ తరఫున సంజయ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ (15వ, 57వ, 58వ) సాధించగా.. ఉత్తమ్‌ సింగ్‌ (10వ) ఓ గోల్‌ కొట్టాడు. కెప్టెన్‌ తిమోతీ క్లెమెంట్‌ మూడు గోల్స్‌ (1వ, 23వ, 32వ)తో ఫ్రాన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంజమిన్‌ మర్‌క్యూ (7వ), కొరెంటీన్‌ సెలియర్‌ (48వ) చెరో గోల్‌ సాధించారు.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌ 5 భారత్‌కు ఈ ఫలితం ఊహించనిదే. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్నా గోల్స్‌లో మాత్రం వెనుకబడిపోయింది. ఫ్రాన్స్‌ మొదటి నిమిషంలోనే భారత్‌కు షాకిచ్చింది. ఆతిథ్య జట్టు డిఫెన్స్‌ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ గోల్‌ కొట్టిన క్లెమెంట్‌.. ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దాడులను కొనసాగించిన ఫ్రాన్స్‌.. కాసేపటికే మర్‌క్యూ ఫీల్డ్‌ గోల్‌తో 2-0 ఆధిక్యం సంపాదించింది. తర్వాత పుంజుకున్న భారత్‌ వరుస దాడులతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఉత్తమ్‌, సంజయ్‌ గోల్స్‌తో తొలి క్వార్టర్‌ ముగిసే సరికి 2-2తో సమంగా నిలిచింది. కానీ 23వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను క్లెమెంట్‌ సద్వినియోగం చేయడంతో ఫ్రాన్స్‌ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది. జోరు కొనసాగించిన ఆ జట్టు మరో రెండు పెనాల్టీ కార్నర్‌లు సాధించినా.. భారత రక్షణశ్రేణిని బోల్తా కొట్టించలేకపోయింది.

అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి 3-2తో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 32వ నిమిషంలో క్లెమెంట్‌ గోల్‌ కొట్టడంతో మూడో క్వార్టర్‌ ముగిసే సరికి ఫ్రాన్స్‌ 4-2తో నిలిచింది. నాలుగో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే భారత రక్షణ శ్రేణిని ఛేదిస్తూ సెలియర్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించడంతో ఫ్రాన్స్‌ ఆధిక్యం 5-2కు పెరిగింది. మూడు గోల్స్‌ వెనుకబడ్డ భారత జట్టు ఆఖర్లో గోల్స్‌ కోసం గట్టిగా ప్రయత్నించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిపై అనేక దాడులు చేసింది. పెనాల్టీ కార్నర్‌ల ద్వారా 57వ, 58వ నిమిషాల్లో సంజయ్‌ గోల్స్‌ సాధించడంతో గోల్స్‌ అంతరాన్ని 4-5కు తగ్గించగలిగింది. కానీ ఫ్రాన్స్‌ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.

ఇదీ చదవండి:

Junior Hockey World Cup: సీనియర్లే స్ఫూర్తిగా.. బరిలోకి భారత కుర్రాళ్లు

ABOUT THE AUTHOR

...view details