తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత హాకీ లెజెండ్​ బల్బీర్ ​సింగ్ ఇకలేరు - Balbir Singh Sr latest news

Hockey icon Balbir Singh Sr dies
భారత హాకీ లెజెండ్​ బల్బీర్ ​సింగ్ ఇకలేరు

By

Published : May 25, 2020, 8:22 AM IST

Updated : May 25, 2020, 10:01 AM IST

09:05 May 25

ఈనెల 8న బల్బీర్​ ఆస్పత్రిలో చేరినప్పటి చిత్రం

భారత హాకీ లెజెండ్​ బల్బీర్​ సింగ్​ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న మొహాలిలోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో చేరిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈరోజు ఉదయం 6.30కు తుదిశ్వాస విడిచారు.

అధిక జ్వరంతో శ్వాసనాళ న్యుమోనియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యబృందం తెలిపింది. కొన్ని రోజుల వైద్యం తర్వాత మే 18న బల్బీర్​ సెమీ కోమాటోజ్​ స్థితిలోకి చేరుకోగా.. ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన మనవడు కబీర్ ప్రస్తావిస్తూ.. "నానాజీ ఈ ఉదయం కన్నుమూశారు" అని ఒక సందేశాన్ని పంపారు.  

రెండేళ్లుగా ఆస్వస్థతకు గురవుతున్న బల్బీర్​.. నాలుగు సార్లు ఇన్​టెన్సివ్​ కేర్​లో ఉన్నారు. గతేడాది జనవరిలో బల్బీర్.. శ్వాసనాళ సంబంధిత వ్యాధి కారణంగా మూడు నెలలకు పైగా ఆసుపత్రిలో గడిపారు.

రికార్డులే రికార్డులు...

బల్బీర్​ సింగ్​కు నలుగురు సంతానం. కుమార్తె సుష్బీర్​.. కుమారులు కన్వాల్బీర్​, కరణ్బీర్​, గుర్బీర్​ ఉన్నారు. మూడుసార్లు ఒలింపిక్​ బంగారు పతకాలను సాధించిన ఆటగాడిగా బల్బీర్​ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ ఎంపిక చేసిన 16 మంది భారత దిగ్గజ క్రీడాకారుల్లో బల్బీర్​ ఒకరు.

  • ఒలింపిక్స్​ పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడిగా సాధించిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. హెల్సింకి ఒలింపిక్స్​లో నెదర్లాండ్స్​పై జరిగిన తుదిపోరులో ఐదు గోల్స్​ నమోదు చేశారు.
  • 1957లో పద్మశ్రీ పురస్కారంతో బల్బీర్​ను భారత ప్రభుత్వం సత్కరించింది.
  • లండన్​(1948), హెల్సింకి(1952) భారత హాకీ జట్టు వైస్​ కెప్టెన్​గా, మెల్​బోర్న్​(1956)లో హకీ జట్టు కెప్టెన్​గా మూడు ఒలింపిక్స్​లో బంగారు పతకాలను సాధించారు.
  • 1975లో జరిగిన హాకీ ప్రపంచకప్​ విజేతగా నిలిచిన భారత జట్టుకు మేనేజర్​గా వ్యవహరించారు.

08:20 May 25

హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ మృతి

హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ మృతి చెందారు. మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతకం సాధించిన భారత జట్టులో ఆయన కీలక సభ్యుడు. బహుళ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Last Updated : May 25, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details