గత మ్యాచ్‌లో విజయంతో జోరు మీదున్న భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే రౌండ్ రాబిన్ లీగ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మన జట్టు తలపడనుంది. 2018 మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవడం వల్ల ట్రోఫీని పంచుకున్న భారత్-పాక్ జట్లు డిఫెండింగ్ ఛాంపియన్ల హోదాలో ఈసారి బరిలో దిగడం విశేషం. ఈ నేపథ్యంలో ఇరు ఛాంపియన్ జట్ల మధ్య జరిగే పోరు మరింత ఆసక్తిని రేపుతోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్.. కొరియాతో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో చిత్తు చేసింది. ఇదే ఊపులో పాక్ పని పట్టాలని మన జట్టు భావిస్తోంది. అయితే మిగిలిన జట్ల మీద ఎలా ఆడినా.. భారత్ అనగానే సర్వశక్తులూ కూడదీసుకునే పాక్‌తో మన జట్టుకు అంత సులభం కాబోదు. ఇటీవల దాయాదిపై మన జట్టు బాగానే ఆడినా.. ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డు మాత్రం పాక్ వైపే ఉంది.