ప్రతిష్ఠాత్మక ఐరోపా ఫుట్‌బాల్ సంఘాల కూటమి (యూఈఎఫ్‌ఏ)లో చీలిక ఏర్పడింది. ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీకి చెందిన 12 ఎలైట్ క్లబ్బులు యూఈఏఫ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఛాంపియన్స్ లీగ్ నుంచి బయటకొచ్చి కొత్తగా సూపర్ లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఛాంపియన్స్ లీగ్ విస్తరణతో పాటు ఓపెన్ విధానం పట్ల వ్యతిరేకతతో ఉన్న 12 (ఇంగ్లాండ్‌కు చెందిన అర్సెనల్, చెల్సీ, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టొటెన్‌హమ్, స్పెయిన్‌కు చెందిన అట్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, ఇటలీ క్లబ్బులు.. ఏసీ మిలన్, ఇంటర్ మిలన్, జువెంచస్) క్లబ్బులు యూఈఎఫ్‌ఏ నుంచి బయటకొచ్చి కొత్తగా సూపర్ లీగ్‌కు శ్రీకారం చుట్టాయి. ఫ్రాన్స్, జర్మనీ క్లబ్బులు అందులో చేరలేదు. 2024 నుంచి ఛాంపియన్స్ లీగ్‌ను 36 జట్లకు విస్తరించాలని యూఈఎఫ్‌ఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఓపెన్ విధానంలో జరిగే ఈ లీగ్‌లో జట్లు కిందిస్థాయిలో, దేశవాళీల్లో పోటీపడి అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఎందుకు అలా?:
12 క్లబ్బులు కలిసి సూపర్ లీగ్‌ను తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం డబ్బు. సుదీర్ఘంగా సాగే ఛాంపియన్స్ లీగ్‌లో నెగ్గితే భారీగా నగదు బహుమతి వస్తుంది. కానీ సూపర్ లీగ్‌లో బరిలో దిగిన ప్రతి జట్టుకూ భారీ మొత్తంలో డబ్బు అందేలా లీగ్‌ను నిర్వహించనున్నారు. సూపర్ లీగ్‌లో ప్రతి జట్టుకూ గత ఛాంపియన్స్ లీగ్ విజేత దక్కించుకున్న దానికంటే మూడు రెట్లు అధికంగా అందనుంది.
ఇదీ చదవండి:ఫిట్‌నెస్‌లో అదే నా ప్లస్ పాయింట్: ధోనీ