ఫుట్‌బాల్ మైదానంలో అడుగుపెడితే ఆ రెండు జట్ల ఆటగాళ్లు యోధుల్లా పోరాడతారు. ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులు, ఆధిపత్యం కోసం నువ్వా నేనా? అని తలపడతాయి మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ. ఓ రకంగా చెప్పాలంటే క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లా ఉంటుంది వాటి మధ్య సాకర్ పోరు. ప్రస్తుతం ఆ రెండు జట్లు కరోనాపై పోరాటానికి తమ పోటీతత్వాన్ని పక్కన పెట్టి, చేతులు కలిపాయి.
కరోనా దెబ్బకు చిరకాల ప్రత్యర్థులు ఒక్కటయ్యారు - Manchester United and City news
ప్రపంచవ్యాప్తంగా విపరీత ఆదరణ ఉన్న క్రీడల్లో ఫుట్‌బాల్ ఒకటి. సాకర్ పోటీల్లో మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మైదానంలో ఎప్పుడూ శత్రువుల్లా పోరాడతారు. ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా కల్లోలం ఏర్పడిన నేపథ్యంలో.. రెండు జట్లూ స్నేహితులుగా మారిపోయాయి.
కొవిడ్-19 బాధితులకు ఆహారం అందిస్తోన్న ఆహార బ్యాంక్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు రెండు జట్లు ముందుకొచ్చాయి. తమ వంతుగా రెండు జట్లు కలిసి విరాళాలూ సేకరిస్తున్నాయి. ఇప్పటికే రెండు క్లబ్‌లు కలిపి రూ. 88 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాయి. వీటన్నింటినీ గ్రేట్ మాంచెస్టర్‌లోని ఆహార బ్యాంక్‌లకు అందజేయనున్నారు. ఫలితంగా ఆ సంస్థలు చేసిన ఆహారాన్ని కరోనా బాధితులు, వారి కుటుంబాలకు అందజేయనున్నారు. ఇంగ్లాండ్‌లోని మొత్తం సాకర్ టోర్నీలన్నీ ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా వేశారు.
ఇప్పటికే కరోనాపై పోరాటానికి ఆయా దేశాలోన్ని ప్రజలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. భారత్‌లోనూ జనతా కర్ఫ్యూ పేరిట ఓ కార్యక్రమం చేయనున్నారు. దీనికి ఇప్పటికే పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కలిసికట్టుగా అవగాహన చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల 82 వేల 395 మంది కరోనా వైరస్ బారిన పడగా.. వారిలో 11 వేల 822 మంది చనిపోయారు.