1994 ఫిఫా ప్రపంచకప్.. వాషింగ్టన్‌లోని ఆర్‌ఎఫ్‌కే స్టేడియంలో మ్యాచ్.. ప్రపంచకప్ అరంగేట్రం చేసిన సౌదీ అరేబియా.. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో తన కంటే ఎంతో మెరుగైన బెల్జియంను ఢీకొట్టింది. ఆసియా స్థాయిలో బలమైన జట్టుగా.. అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అరేబియా ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. అలాంటి కీలక పోరులో సయీద్ మాయ చేశాడు.
మ్యాచ్ ఆరంభమైన అయిదు నిమిషాలకే.. దాదాపు 70 గజాల దూరం నుంచి బంతిని డ్రిబ్లింగ్ చేసుకుంటూ వచ్చి.. పది సెకన్లలో గోల్‌కీపర్ సహా అయిదుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టించి బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. బంతిపై కచ్చితమైన నియంత్రణ, కాళ్లలో వేగం, ప్రత్యర్థులను మాయ చేసే నైపుణ్యంతో అతను చేసిన ఈ గోల్ ఆల్‌టైమ్ ప్రపంచకప్ అత్యుత్తమ గోల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
బంతిని అందుకున్న అతను ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ దూసుకెళ్లాడు. రెండు వైపుల నుంచి అడ్డుకోవడానికి వస్తున్న ఆటగాళ్ల మధ్యలో నుంచి బంతిని తన్నుకుంటూ ముందుకు సాగాడు. ఎడమవైపు నుంచి ఓ ఆటగాడు అడ్డు వచ్చాడు. అతణ్ని తప్పించేందుకు బంతిని కుడివైపు డ్రిబ్లింగ్ చేశాడు. ఈసారి మరో ఆటగాడు ముందు నుంచి అడ్డుకోవడానికి రాగా.. ముందు కుడి వైపు బంతిని తన్నిన సయీద్ వెంటనే దాన్ని ఎడమవైపు మళ్లించి అతణ్ని దాటాడు. ఎడమ వైపు నుంచి బంతిని ఆపేందుకు వచ్చిన మరో ఆటగాడు కాళ్లకు అడ్డం పడ్డాడు. గోల్‌కీపర్ కూడా బంతిని ఆపేందుకు ముందుకు వచ్చాడు. వీళ్లిద్దరినీ మాయ చేసిన అతను.. వాళ్ల మీదుగా బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు.