Messi Ballon d'Or 2021: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫుట్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చే ప్రతిష్టాత్మక 'బాలన్ డి ఓర్' అవార్డును 7 సార్లు అందుకొని చరిత్ర సృష్టించాడు. బాలన్ డి ఓర్ అవార్డు 2021కి సంబంధించి ఫ్రాన్స్ పుట్‌బాల్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ప్యారిస్‌లో జరిగిన జరిగిన ఈ వేడుకలో ఈ అవార్డు గెలుచుకునేందుకు 30 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. చివరగా రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ 'బాలన్ డి ఓర్' అవార్డు అందుకున్నాడు. మెస్సీ(Messi News) అంతకు ముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2020లో కరోనా కారణంగా అవార్డుల కార్యక్రమం రద్దయింది.
ఈ అవార్డును గెలుచుకోవడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. "మళ్లీ ఈ అవార్డు అందుకోవడం ఎంతో అపురూపం. రెండేళ్ల కిందట ఈ అవార్డును తీసుకుంటున్నప్పుడు ఇక ఇదే చివరిది అని అనుకున్నాను. కానీ కోపా అమెరికా కప్ గెలవడం ఈ అవార్డు గెలవడంతో ముఖ్య పాత్ర పోషించింది" అని మెస్సీ అన్నాడు. ఇక స్పానిష్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్ అలెక్సియా పుటెల్లాస్ మహిళ విభాగంలో బాలన్ డి ఓర్ అవార్డును గెలుచుకుంది. ఈ ఏడాది ఆమె 26 గోల్స్ చేసింది. ఈ అవార్డును గెలుచుకోవడం ఈమెకు ఇదే తొలిసారి.
Messi Copa America 2021: 34ఏళ్ల అర్జంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ గతేడాది బార్సిలోనా తరఫున 48 మ్యాచుల్లో 38 గోల్స్ చేశాడు. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది జరిగిన కోపా అమెరికా కప్ ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో నెగ్గింది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ ఓ మెగా టైటిల్‌ను అందించాడు.