కరోనా(కోవిడ్-19) భయంతో ప్రపంచం వణికిపోతున్న వేళ, ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నడుచుకోవాలని అన్నాడు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉందని, తగిన జాగ్రత్తలు పాటించి, అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
" ఈరోజు ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మాట్లాడటం లేదు. ఓ కుమారుడిగా, తండ్రిగా, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న తాజా పరిణామాలకు సంబంధించిన మానవతావాదిగా మాట్లాడుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్థానిక ప్రభుత్వాలు సూచించిన విషయాలను మనమంతా కచ్చితంగా పాటించాల్సిన అవసరముంది. ఇతరుల ప్రాణాలు కాపాడటమే అన్నింటికన్నా ముఖ్యమైన విషయమవాలి. ఈ మహమ్మారి కారణంగా ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. నా సహచరుడు డేనియల్ రుగానీలా వైరస్ బారిన పడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా"