తెలంగాణ

telangana

ETV Bharat / sports

బయో-బబుల్​లో ఐఎస్​ఎల్​ నిర్వహణకు రంగం సిద్ధం - ఐఎస్​ఎల్​ 2020 వార్తలు

ఇండియన్​ సూపర్​లీగ్​ (ఐఎస్​ఎల్​) నిర్వహణకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీని గోవా వేదికగా సుమారు నాలుగు నెలల పాటు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

How Does the Bio-Bubble for the Indian Super League Function?
బయో-బబుల్​లో ఐఎస్​ఎల్​ నిర్వహణకు రంగం సిద్ధం

By

Published : Nov 19, 2020, 7:54 AM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ సిరీస్‌లు.. యూఏఈలో ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాల్లో బయో బబుల్‌ వాతావరణంలో టోర్నీలు జరిగాయి.. జరుగుతున్నాయి! ఇప్పుడు మన దగ్గర కూడా బుడగలో ఓ పెద్ద టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 4 నెలల పాటు గోవాలోని మూడు వేదికల్లో జరిగే ఈ టోర్నీలో 115 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 11 జట్లు టైటిల్‌ కోసం ఈసారి టోర్నీ బరిలో ఉన్నాయి. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా నిర్వాహకులు పటిష్టమైన భద్రత, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

నిబంధనలు:

  • కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో ప్రతి జట్టుకు ప్రత్యేకంగా ఒక హోటల్‌ కేటాయించారు. మూడు మైదానాల్లో పనిచేసే టీవీ ప్రసార సిబ్బందిని విడివిడిగా 3 హోటళ్లలో ఉంచారు.
  • బుడగలో ఉన్నవాళ్లకు ప్రతి మూడు రోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తారు.
  • బుడగ నిబంధనల్ని అతిక్రమించినా.. కొత్తగా ఎవరైనా వచ్చినా ఐసోలేషన్‌ తప్పనిసరి. నిబంధనల్ని మళ్లీ మొదట్నుంచి అనుసరించాలి. రెండు సార్లు పరీక్షలు చేయించుకోవాలి. నాలుగైదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. మూడు పరీక్షల్లో నెగటివ్‌ వస్తేనే బుడగలోకి అనుమతిస్తారు.
  • ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వేరే అంతస్తులో 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. రెండు సార్లు నిర్వహించే పరీక్షల్లో నెగటివ్‌ వస్తేనే మళ్లీ అనుమతిస్తారు. మొదటి పరీక్షలో నెగటివ్‌ వచ్చిన 48 గంటల్లో రెండో పరీక్ష ఉంటుంది. రెండింట్లో నెగటివ్‌ వస్తే బుడగలోకి రావొచ్చు.

5 విమానాలు.. 40 రోజులు

ఐఎస్‌ఎల్‌ కోసం రాయ్‌ ప్రయాస

పది కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు.. మూడు దేశాల్లో 30 రోజుల పాటు క్వారంటైన్‌.. అయిదు విమానాల్లో ప్రయాణం.. మొత్తంగా 40 రోజుల ప్రయాస.. ఇదీ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో ఆడడం కోసం ఏటీకే మోహన్‌ బగాన్‌ ఆటగాడు రాయ్‌ కృష్ణ పడిన కష్టం. ఫిజీ దేశస్థుడైన ఈ భారత సంతతి ఆటగాడు శుక్రవారం ఆరంభమయ్యే ఐఎస్‌ఎల్‌ సీజన్‌ కోసం సెప్టెంబర్‌ 24నే ఇంటి నుంచి బయల్దేరాడు. సాధారణ పరిస్థితుల్లో అయితే రెండు రోజుల్లో అతను లీగ్‌ జరిగే గోవాకు చేరుకునే వాడే. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా.. పరిమిత విమాన సర్వీసులతో పాటు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న క్వారంటైన్‌ నిబంధనల ఫలితంగా అతను 40 రోజుల అనంతరం జట్టుతో కలిశాడు.

రాయ్‌ కృష్ణ

"ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మతి తప్పినట్లయింది. ఎప్పటికప్పుడూ శానిటైజేషన్‌ చేసుకుంటూనే ఉన్నా. ఎప్పుడూ మాస్కు ధరించే ఉన్నా" అని కృష్ణ తెలిపాడు. మొదట తన దేశంలోనే లబాస నుంచి నడి చేరుకోవడానికి దేశీయ విమానంలో ప్రయాణించిన అతను.. అక్కడి నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ చేరుకున్నాడు. అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్‌ పూర్తయిన వారం తర్వాత సిడ్నీకి విమానం ఉండటం వల్ల.. అప్పటివరకు అతడు తన బంధువులతో సరదాగా గడిపాడు. అక్టోబర్‌ 14న సిడ్నీ వెళ్లిన అతను.. రెండు రోజుల క్వారంటైన్‌ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి అక్టోబర్‌ 17న దిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఓ రాత్రి క్వారంటైన్‌లో ఉండి మరో విమానంలో తర్వాతి రోజు గోవాలో అడుగుపెట్టాడు. అక్కడ 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసిన అతను.. చివరకు ఇంటి నుంచి బయల్దేరిన 40 రోజుల తర్వాత ఈ నెల 3న జట్టుతో కలిశాడు. గత సీజన్‌లో 15 గోల్స్‌తో మరో ఇద్దరు ఆటగాళ్లతో కలిసి కృష్ణ అగ్రస్థానంలో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details