తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐఎస్‌ఎల్‌: మహమ్మారి వేళలో.. ఫుట్‌బాల్‌ మొదలైంది - ఐఎస్​ఎల్ వార్తలు

కరోనా వేళలోనూ భారత్​ ఓ మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించింది. గోవాలోని బంబోలిమ్​ వేదికగా ఇవాళ్టి నుంచి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్​ఎల్​) 7వ సీజన్​ ప్రారంభమైంది. తొలిపోరులో కేరళ బ్లాస్టర్స్‌, ఏటీకే మోహన్‌ బగాన్‌ తలపడుతున్నాయి.

isl 2020-21
ఐఎస్‌ఎల్‌: మహమ్మారి వేళలో.. ఫుట్‌బాల్‌ మొదలైంది..

By

Published : Nov 20, 2020, 7:48 PM IST

దాదాపుగా ఎనిమిది నెలలు.. దేశంలో ఎక్కడా క్రీడా సందడి లేదు.. మైదానంలో ఆటగాళ్ల పోరాటాలు లేవు.. ఉత్కంఠభరిత విన్యాసాలతో.. హోరాహోరీ మలుపులతో.. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే ఆ కిక్కు లేదు.. దానికి కారణం కరోనా మహమ్మారి. ఆ పరిస్థితులను దాటి విదేశాల్లో ఫుట్‌బాల్‌, క్రికెట్‌ పోటీలు మొదలయ్యాయి. మన దగ్గర జరగాల్సిన ఐపీఎల్‌-13.. యూఏఈలో ముగిసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో క్రీడా రంగానికి పునఃప్రారంభం ఎప్పుడూ అనుకుంటున్న తరుణంలో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ వచ్చేసింది. శుక్రవారం ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్‌ ఆరంభమైంది.

తొలి మ్యాచ్‌లో..

తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీతో ఏటీకే మోహన్‌ బగాన్‌ తలపడుతోంది. ఈరోజు రాత్రి 7.30కు ఆరంభమైన ఈ మ్యాచ్‌ను.. స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రసారం చేస్తోంది.

బయో బబుల్​లో..

ఐఎస్‌ఎల్‌లో జరిగిన గత ఆరు సీజన్లు ఒకెత్తయితే.. ఈ ఏడో సీజన్‌ మరొకెత్తు. కరోనా నేపథ్యంలో బయో బబుల్‌ వాతావరణంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. గోవాలోని మూడు స్టేడియాల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఖాళీ మైదానాల్లోనే ఈ సీజన్‌ కొనసాగనుంది. ఇప్పటికే అన్ని జట్లు 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాయి. ఈ బుడగలో ఉన్నవాళ్లకు ప్రతి మూడు రోజులకోసారి వైరస్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తారు.

పోటీలో పదకొండు

లీగ్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో 11 జట్లు టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. మొత్తం 115 మ్యాచ్‌లు జరగనున్నాయి. గత సీజన్‌లో 10 జట్లతో సాగిన లీగ్‌లో.. 95 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సారి ఐఎస్‌ఎల్‌లో ఈస్ట్‌బెంగాల్‌ అరంగేట్రం చేయనుంది. అలాగే గత సీజన్‌ ఛాంపియన్‌ అట్లెటికో ది కోల్‌కతా (ఏటీకే), ఐ- లీగ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మోహన్‌ బగాన్‌ కలిసి ఒకే జట్టు (ఏటీకే మోహన్‌ బగాన్‌)గా బరిలో దిగనున్నాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ విధానంలో సాగే ఈ టోర్నీలో లీగ్‌ మ్యాచ్‌లు ముగిసే సమయానికి.. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

ఛాంపియన్‌ అట్లెటికో

ఐఎస్‌ఎల్‌లో అట్లెటికో ది కోల్‌కతా విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఆ జట్టు మూడు (2014, 2016, 2019-20) సార్లు టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లోనూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న ఆ జట్టే విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. చెన్నయిన్‌ ఎఫ్‌సీ ఇప్పటివరకూ రెండు (2015, 2017-18) సీజన్లలో విజేతగా నిలిచింది. బెంగళూరు (2018-19) ఓ సారి నెగ్గింది.

హైదరాబాద్​ జట్టు..

సోమవారం ఒడిషా ఎఫ్‌సీతో మ్యాచ్‌తో హైదరాబాద్‌ ఎఫ్‌సీ పోరాటం మొదలెట్టనుంది. గత సీజన్‌లో ఐఎస్‌ఎల్‌ అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంతో లీగ్‌ను ముగించింది. మరోవైపు గోవా ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీ, చెన్నయిన్‌ ఎఫ్‌సీ, ముంబయి సిటీ ఎఫ్‌సీ, జంషెడ్‌పుర్‌ ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ, ఈస్ట్‌ బెంగాల్‌ కూడా సత్తాచాటేందుకు సిద్ధమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details