కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలలుగా అన్ని క్రీడలూ స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాయి. ప్రేక్షకులు లేకుండానే క్రీడలు ప్రారంభించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న వియత్నాం.. శుక్రవారం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతి ఇస్తూ ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించింది.
ఫుట్‌బాల్ మ్యాచ్కు హాజరైన అభిమానులు 30వేల మంది హాజరు..
వియత్నాం ప్రొఫెషనల్ లీగ్‌లో భాగంగా నామ్‌దిన్హ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. దీనికి సుమారు 30 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. వారంతా సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. ఒకర్నొకరు తాకుకుంటూ మ్యాచ్‌ను ఆస్వాదించారు. కొద్ది మంది మాత్రమే ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించారు. ఈ మ్యాచ్‌లో వియట్టెల్ జట్టు 2-1 తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.
హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారని స్టేడియానికి వచ్చిన అభిమానులు చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి తీసుకున్న చర్యలు బాగున్నాయని.. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారని తెలిపారు.
పోల్చడం సరికాదు..
మ్యాచ్ అనంతరం వియత్నాం టీమ్ సారథి క్యూహాయ్ మాట్లాడుతూ.. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ దేశాన్ని ఇతర దేశాలతో పోల్చడం సరికాదన్నాడు. అయితే, కొవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడంలో వియత్నాం విజయవంతమైందని, తద్వారా తమ ఫుట్‌బాల్ ఆట మళ్లీ ప్రారంభమైందని తెలిపాడు. ఈ క్రీడ ద్వారా.. తమ దేశం మహమ్మారిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొందనే విషయం తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఏకైక దేశం...
కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలిసిన వెంటనే వియత్నాం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి ఇతరులను అనుమతించలేదు. లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు చేసి కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తపడింది. ఈ నేపథ్యంలోనే మార్చిలో వియత్నం లీగ్ మ్యాచ్‌లు నిలిపివేసింది. కేవలం 328 పాజిటివ్ కేసులతో ఒక్క మరణం కూడా సంభవించని దేశంగా పేరుగాంచింది. దీంతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడిప్పుడే సాధారణ జీవనశైలికి అలవాటు పడుతోంది. ఇక స్టేడియాలకు వేల సంఖ్యలో అభిమానులను అనుమతించి.. కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొన్నామనే విషయాన్ని చాటిచెప్పింది.
ఇదీ చూడండి : సమయం ఆసన్నమైంది మిత్రమా.. పెళ్లి రైలు ఎక్కేద్దాం!