తెలంగాణ

telangana

ETV Bharat / sports

Euro Cup: క్వార్టర్స్​లో స్విట్జర్లాండ్, స్పెయిన్ - ఫ్రాన్స్​కు షాక్

యూరో కప్​ క్వార్టర్స్​లో అడుగుపెట్టాయి స్విట్జర్లాండ్, స్పెయిన్. ప్రీక్వార్టర్స్​లో ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్​కు స్విస్ జట్టు షాకివ్వగా.. క్రొయేషియాను ఇంటికి పంపింది స్పెయిన్.

Euro Cup
యూరో కప్

By

Published : Jun 29, 2021, 7:35 AM IST

ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌కు స్విట్జర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. యూరో కప్‌ ప్రీక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 3-3తో సమంగా నిలవడం వల్ల మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్‌ చేయలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించారు.

ఇందులో స్విట్జర్లాండ్‌ 5 పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మార్చగా, ఫ్రాన్స్‌ నాలుగు గోల్స్‌ చేసి ఓటమిపాలైంది. ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపె పెనాల్టీ కిక్‌ను స్విట్జర్లాండ్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సోమర్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఫలితంగా స్విస్ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కి దూసుకెళ్లింది. తన తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

క్రొయేషియాకు స్పెయిన్ చెక్

క్రొయేషియాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్​లో స్పెయిన్ అదరగొట్టింది. అదనపు సమయంలో రెండు గోల్స్ చేసి 5-3 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది. ఫలితంగా క్వార్టర్స్​లో అడుగుపెట్టింది. ఇరుజట్లు 3-3తో సమంగా ఉండగా లభించిన అదనపు సమయంలో 100వ నిమిషం వద్ద అల్వరో మొరాట్, 103వ నిమిషం వద్ద మైఖెల్ ఒయర్​జబల్​ బంతిని గోల్ పోస్ట్​లోకి పంపి స్పెయిన్​కు విజయాన్ని అందించారు.

మొదటి అర్ధ భాగంలో స్పెయిన్ జట్టు చాలా ఇబ్బందిపడింది. క్రొయేషియా డిఫెన్స్​ను దాటుకుని గోల్స్ చేయడానికి కష్టాలు పడింది. దీనికి తోడు స్పెయిన్ ఆటగాడు పెడ్రి ఇచ్చిన పాస్​ను మిస్ చేసిన గోల్ కీపర్​ ఉనాయ్ సిమోన్..​ జట్టు సెల్ఫ్​ గోల్​ చేయడంలో సాయం చేసి.. క్రొయేషియాకు మొదటి గోల్​ అందించాడు. తర్వాత పుంజుకున్న స్పెయిన్​ 38 నిమిషంలో గోల్​తో స్కోర్​ను సమం చేసింది. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడి చెరో రెండు గోల్స్ సాధించాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు. ఇందులో స్పెయిన్ రెండు గోల్స్ చేసి స్పష్టమైన ఆధిక్యంతో క్రొయేషియాకు చెక్ పెట్టింది.

ఇవీ చూడండి: Euro Cup: రొనాల్డోసేనకు ఊహించని షాక్

ABOUT THE AUTHOR

...view details