యూరో 2020 ఫుట్‌బాల్(Euro 2020 FootBall) టోర్నీలో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ ప్రధాన టోర్నీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్.. వరుస విజయాలతో జోరుమీదున్న ఇటలీతో తుదిపోరులో తలపడనుంది. మొట్టమొదటి యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఇంగ్లిష్ జట్టు ఉండగా.. ఈ టోర్నీలో రెండోసారి విజయదుందుభి మోగించాలనే లక్ష్యంతో ఇటలీ జట్టు ఉంది. బలాబలాల్లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండే ఫెవరేట్..
సొంతగడ్డపై.. స్థానిక అభిమానుల మద్దతుతో మైదానంలో అడుగుపెట్టబోతున్న ఇంగ్లాండే(England Football Team) ఈ ఫైనల్లో ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు పటిష్ఠంగా ఉంది. 1966 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఓ ప్రధాన టోర్నీ ఫైనల్ చేరడమిదే తొలిసారి. యూరో కప్‌లో ఆ జట్టుకిదే తొలి ఫైనల్. కెప్టెన్ హ్యారీ కేన్, రహీమ్ స్టెర్లింగ్, డిఫెండర్లు.. మెగ్వాయోర్, లూక్ షా, జాన్ స్టోన్స్, గోల్‌కీపర్ జోర్డాన్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో ఇంగ్లాండ్‌కు మెరుగైన అవకాశాలున్నాయి.