టర్కీతో గురువారం జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నుంచి క్రొయేషియా డిఫెండర్ డొమాగోజ్ విడా అర్ధంతరంగా వైదొలిగాడు. సదరు ఆటగాడికి మధ్యలో కరోనా వైరస్ సోకడం వల్ల అతడిని మ్యాచ్ నుంచి తప్పించినట్లు క్రొయేషియా సాకర్ సమాఖ్య తెలిపింది.
కరోనా సోకిందని ఆట మధ్యలోనే తప్పించారు! - క్రొయేషియా ఫుట్‌బాలర్ విడాకు కరోనా
గురువారం టర్కీ, క్రొయేషియా మధ్య జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నుంచి క్రొయేషియా డిఫెండర్ డొమాగోజ్ విడా వైదొలిగాడు. ఈ ఆటగాడికి కరోనా సోకడం వల్ల మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పించినట్లు క్రొయేషియా సాకర్ సమాఖ్య ఓ ప్రకటనలో తెలియజేసింది.
టర్కీలో జరిగే మ్యాచ్‌కు మూడు రోజుల ముందుగా చేసిన కరోనా పరీక్షల్లో డొమాగోజ్ విడాకు నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కానీ, శనివారం స్వీడన్‌తో జరగనున్న నేషన్స్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా క్రొయేషియా జట్టుకు మరోసారి పరీక్షలు చేయగా అందులో అతడికి వైరస్ సోకినట్లు తేలిందని సమాఖ్య వెల్లడించింది.
దీంతో ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ ఇస్తాంబుల్‌లో 10 రోజుల పాటు స్వీయనిర్బంధంలో ఉండనున్నాడు. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్ధమవుతారని సమాఖ్య తెలిపింది. ఈ మ్యాచ్‌లో విడాకు ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.