స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా.. ప్రాణాంతక కరోనా సోకి మరణించాడు. 21 ఏళ్ల ఇతడు.. ఇప్పటికే లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. 2016 నుంచి అట్లెటికో పోర్టాడా అల్టాస్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడి మృతిపై జట్టు సభ్యులు సంతాపం తెలిపారు.
"దురదృష్టవశాత్తు కరోనా వల్ల మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన మా కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా కుటుంబానికి, అతడి బంధువులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం"
-అట్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్
కొవిడ్ కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 345 మంది మృతి చెందారు. సోమవారం నాటికి ఆ దేశంలో బాధితుల సంఖ్య పదివేలకు చేరుకుంది. ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో తక్కువ వయసున్న వ్యక్తి గార్సియా కావడం విచారం. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ముందుజాగ్రత్తగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : భయం భయం.. క్రీడారంగంపై కరోనా ప్రభావం