1970 కప్‌లో బ్రెజిల్, ఇటలీ కప్ కోసం పోటీపడ్డాయి. టైటిల్ ఫేవరెట్ బ్రెజిలే కానీ.. ఇటలీని ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. అందుకు తగ్గట్టే మజానిచ్చింది తుది సమరం. ఇటలీ మెరుగ్గానే ఆడినా.. పీలే (18వ నిమిషం) చేసిన గోల్‌తో బ్రెజిల్ ఖాతా తెరిచింది. బొనిన్‌సెగ్నా (37వ ని) గోల్‌తో ఇటలీ స్కోరును సమం చేసినప్పటికీ 3-1 ఆధిక్యం సాధించడానికి బ్రెజిల్‌కు ఎంతో సమయం పట్టలేదు. జెర్సన్ (66వ ని), జైర్జినో (71 ని) స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ కొట్టారు. బ్రెజిల్ విజయం ఖాయం అయినా కార్లోస్ ఇచ్చిన ఆఖరి పంచ్ అదిరిపోయింది. అప్పటికే ఇటలీ ఆధిక్యం కోల్పోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆఖరి నిమిషాల్లో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కానీ బంతి బ్రెజిల్ ఆధీనంలోనే ఉంది.
బాణంలా దూసుకొచ్చి గోల్ కొట్టాడు.. అతడు ఎవరంటే?
ఫుట్‌బాల్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు ఉండొచ్చు.. ఎన్నో క్లాసిక్ గోల్స్ ఉండొచ్చు.. కానీ ఇటలీతో 1970 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్ కెప్టెన్ అల్బెర్టో కార్లోస్ టోరెస్ కొట్టిన గోల్ మాత్రం అద్భుతం. విల్లు నుంచి వదిలిన బాణంలా.. గన్ నుంచి పేలిన బుల్లెట్‌లా.. అతడు గోల్‌పోస్టు దగ్గరకు దూసుకొచ్చిన తీరు.. అదే ఊపులో గోల్ చేసిన వైనం నభూతో!
ఈ సమయంలోనే ఓ అద్భుతం జరిగింది.. మైదానంలో బంతిని ఎక్కువసేపు ఎడమవైపే డ్రిబ్లింగ్ చేసుకుంటూ చిన్న చిన్న పాస్‌లు ఇచ్చుకుంటూ వస్తోంది బ్రెజిల్ జట్టు. జెరినో నుంచి పాస్ అందుకున్న పీలేను ముగ్గురు ఇటలీ డిఫెండర్లు చుట్టు ముట్టారు. ఒక్కొక్కరిని తప్పిస్తూ బంతిని ముందుకు తోస్తూ గోల్ పోస్టు సమీపానికి వెళ్లాడు పీలే. బ్రెజిల్ ఆటగాళ్లంతా ఎడమవైపు ఉండడంతో ఇటలీ డిఫెండర్లూ అటే కాపు కాశారు. కానీ పీలే అనూహ్యంగా కుడివైపు పాస్ ఇచ్చాడు. ఉన్నట్టుండి ఎలా వచ్చాడో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ కార్లోస్ బుల్లెట్‌లా దూసుకొచ్చి బంతిని గోల్ పోస్టులోకి కొట్టేశాడు. అతని మెరుపు షాట్‌ని ఆపాలని ఓ డిఫెండర్.. గోల్‌కీపర్ డైవ్ కొట్టినా లాభం లేకపోయింది. కొన్ని సెకన్లు ఏం అయిందో అర్ధం కాలేదు! ఆ తర్వాత చప్పట్లు, ఈలలతో స్టేడియం మార్మోగిపోయింది. ఎక్కడో మైదానం మధ్యలో ఉండి.. బంతి గమనాన్ని గమనిస్తూ.. తనకు అవకాశం ఉందని భావిస్తూ గొప్ప అంచనాతో మెరుపులా దూసుకొచ్చిన కార్లోస్.. అద్భుతాన్నే ఆవిష్కరించాడు. 86వ నిమిషంలో చేసిన ఈ గోల్‌తోనే బ్రెజిల్ 4-1తో కప్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఎన్నో గోల్స్ ఉన్నా.. కార్లోస్ చేసిన ఈ గోల్ మాత్రం అద్భుతం.
ఇదీ చూడండి : ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యం నుంచి భారత్ ఔట్