ఆ చిన్నారికి ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. తన ఫేవరెట్ జట్టు మైదానంలో ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో ఆశ. కానీ దురదృష్టవశాత్తు పుట్టుకతోనే అంధుడైన ఆ బాలుడు స్టేడియంలోనే కాదు.. టీవీ ముందు కూర్చుని కూడా మ్యాచ్‌ను వీక్షించలేడు. అయినా సరే తన కుమారుడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నాడా తండ్రి. చూపులేని కొడుకును స్టేడియంకు తీసుకెళ్లి.. మ్యాచ్ ఆద్యంతం ఎలా సాగుతుందో వివరించాడు. హృదయాలను హత్తుకునే ఈ సంఘటన కొలంబియాలో చోటుచేసుకుంది.
సెబాస్టియన్ అనే చిన్నారి పుట్టుకతోనే అంధుడు. కానీ అతడికి ఫుట్‌బాల్ ఆటంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ జట్టు మైదానంలో తలపడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని ఆశపడ్డాడు. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న సెబాస్టియన్ తండ్రి.. బారాన్‌క్విల్లాలోని ఎస్టాడియో మెట్రోపొలిటనో రాబర్టో మెలెండెజ్ మైదానంలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రతిక్షణం మైదానంలో ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో కొడుకుకు వివరించి చెప్పాడు.