T20 World Cup Zim Vs Pak: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 44 పరుగులు మినహా ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3 మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఇప్పటికే భారత్ జట్టుపై ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టుకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
మరొక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
దక్షిణాఫ్రికా బ్యాటర్ రోసోవ్ (109) టీ20 ప్రపంచకప్ 2022లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోసోవ్‌తోపాటు డికాక్ (63) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. దీంతో 104 పరుగుల తేడాతో భారీ విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. బంగ్లా జట్టులో లిటన్ దాస్ (34) టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్ నోకియా 4, షంసి 3.. కేశవ్, రబాడ చెరో వికెట్ తీశారు.
ఇప్పటివరకు సంచలనాలు ఇవే..
- అర్హత పోటీల్లో శ్రీలంకపై నమీబియా విజయం
- అర్హత పోటీల్లో వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ గెలుపు
- అర్హత పోటీల్లో విండీస్‌పై ఐర్లాండ్ విజయం
- సూపర్ -12 దశలో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజయం (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)