Yuzvendra Chahal Australia Series 2023 : ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కలేదు. అయితే ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో చాహల్‌ను ఎంపిక చేసుకోకపోవడం పట్ల టీమ్ఇండియా మాజీ ప్లేయర్ హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలదన్న విషయం తనకు అర్థం కావడం లేదని, జట్టులో ఉండదగిన ఆటగాళ్లలో అతడొకడంటూ వ్యాఖ్యానించాడు.
"చాహల్ ఇప్పటి జట్టులో ఉంటే బాగుండేది. అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా..? అనేది కూడా తెలియడం లేదు. కేవలం మనం నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోకైనా చాహల్‌ను తీసుకుంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆసియా కప్‌లో విజయాలను అలవాటు చేసుకున్న భారత్ తప్పకుండా ఆసీస్‌ను ఓడిస్తుందనే నమ్మకం నాకు ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టు కాస్త బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అయినా సరే స్వదేశంలో కాబట్టి అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించాలని మిగతా ఆటగాళ్లు కూడా భావిస్తారు. ఈ క్రమంలో వారు తప్పకుండా విజేతగా నిలుస్తారు. ఆసీస్‌ను ఓడించాలంటే చాలా కష్టపడాలి. లోయర్ ఆర్డర్ వరకూ వారికి బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌ను ఓడిపోయినా సరే ఆసీస్ బలమైనదే. ఎనిమిదో స్థానం వరకూ భారీగా హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు" అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.