ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్‌తో దారుణంగా విఫలమైన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అండగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫామ్ అందుకొని.. గతంలో లాగే చెలరేగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని యువరాజ్ జోస్యం చెప్పాడు.
ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మిచెల్ స్టార్క్ దెబ్బకు తొలి రెండు వన్డేల్లో ఎల్బీగా గోల్డెన్ డకౌట్ అయిన సూర్య.. మూడో వన్డేలో అష్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సైతం.. సూర్యకు మద్దుతుగా ట్వీట్ చేశాడు.
'ప్రతీ క్రీడలో ప్రతీ ప్లేయర్ తమ కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఒకానొక దశలో మేం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించాం. అవకాశం లభిస్తే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో సూర్య కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం నాకు ఉంది. మన ప్లేయర్లకు మనం మద్దతుగా నిలుద్దాం. సూర్య మళ్లీ తన ఆటతో ఉదయిస్తాడు' అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
ఇటీవలే.. టీమ్ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్‌లో చెలరేగాలని గావస్కర్ సూచించాడు. ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఇలా విఫలమవ్వడం సాధారణమని, ఎక్కువగా ఆలోచించకుండా పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చాడు. సిరీస్‌లో సూర్య మూడు బంతులే ఆడటం దురదృష్టకరమని, మూడు అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. వరుసగా గోల్డెన్ డకౌట్‌లు అయినంత మాత్రాన అతడి సామర్థ్యం, నైపుణ్యాలు ఎక్కడికీ పోవని చెప్పాడు.
మరోవైపు, పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం విరుద్ధంగా స్పందించాడు. సూర్యకుమార్ వన్డేల్లో ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంట్నేనని ఆరోపించాడు. "వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ గోల్డెన్ డక్ అవడం అతడి తప్పు కాదు. ఇందుకు పూర్తి బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంట్దే. అతడిని డౌన్ ఆర్డర్‌లో దించి ఆత్మవిశ్వాసాన్ని తగ్గేలా చేశారు. సూర్యను బ్యాటింగ్‌కు ముందుగా పంపించాల్సింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తర్వాత అతడు బ్యాటింగ్ చేస్తే బాగుండేది. అలా కాకుండా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యను పంపించి వారి తర్వాత అతడికి అవకాశమిచ్చారు" అని కనేరియా అన్నాడు.